మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించలేం: కేంద్రం
న్యూఢిల్లీ: మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ను నేరంగా పరిగణించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. 'భారత్‌లో మారిటల్ రేప్ నేరంగా పరిగణించలేం. ఎందుకంటే దేశంలో అక్షరాస్యత, మెజారిటీ మహిళలకు ఆర్థిక స్వావలంబన లేకపోవడం, సమాజ దృష్టికోణం, పేదరికం, విభిన్నత వంటి అనేక సమస్యలు ఉన్నాయి' అని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలను భారత్ గుడ్డిగా అనుసరించబోదని తెలిపింది.
కేంద్రం తరఫున అడ్వకేట్ మోనికా అరోరా ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. సత్వర ట్రిపుల్ తలాఖ్ విషయంలో మహిళలకు అనుకూల వైఖరిని కేంద్రం తీసుకోవడంతో ఈ విషయంలోనూ అనుకూల వైఖరిని తీసుకుంటుందని భావించారు. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించడం లింగ సమన్వత్యంలో కీలక ముందడుగుగా భావించారు. కానీ కేంద్రం ఈ విషయంలో భిన్నమైన వైఖరిని తీసుకుంది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించే ముందు ఏది మారిటల్ రేప్, ఏది నాన్ మారిటల్ రేప్ అన్నది స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరముందని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. 'ఒక వ్యక్తి తన భార్యతో చేసే శృంగార చర్యలన్నీ మారిటల్ రేప్ కింద పరిగణిస్తే.. ఏకపక్షంగా భార్య చెప్పిన విషయాల ఆధారంగా తీర్పు ఇవ్వాల్సి వస్తుంది' అని పేర్కొంది. సాక్ష్యాల విలువను గుర్తించడం ఈ విషయంలో ప్రధాన సమస్యగా మారుతుందని తెలిపింది. అంతేకాకుండా వివాహ వ్యవస్థను మారిటల్ రేప్ అస్థిరపరిచే అవకాశముందని కేంద్రం అభిప్రాయపడింది.