
పలు చిత్రాలకు సెన్సార్ అధికారి లంచం!
ముంబై: సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేముందు సీన్లను కత్తిరించకుండా యథావిధిగా ఉంచేందుకే పలు చిత్రాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీఈఓ రాకేశ్ కుమార్ లంచం తీసుకున్నాడని సీబీఐ స్పష్టం చేసింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక ప్రాంతీయ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రాకేశ్ కుమార్ రూ. 70 వేలు డిమాండ్ చేసి, ఆయన ఏజెంట్లు ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తమిళ చిత్రం అంజాన్ కు కూడా రాకేశ్ లంచం తీసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
అతను ఆ చిత్రానికి సంబంధించి లంచంతో పాటు ఒక ల్యాప్ టాప్ ను , ఐప్యాడ్ తీసుకున్నాడన్నారు. చిత్ర నిర్మాతలపై తరచు బెదిరింపులకు పాల్పడుతూ లంచం తీసుకున్నట్లు తెలిపారు. కొందరు ప్రముఖ నిర్మాతలు కూడా తమ సినిమాల సెన్సార్ సర్టిఫికెట్ల కోసం కుమార్‌కు లంచం ఇచ్చినట్లుగా వారు పేర్కొన్నారు. ఆగస్టు 9 వ తేదీన సికిందర్ తెలుగు చిత్రానికి రూ. 50,000 లంచం తీసుకున్నాడని తెలిపారు. ఈ కేసులకు సంబంధించి శుక్రవారం రాకేశ్ కుమార్ ను కోర్టు లో ప్రవేశపెట్టిన సీబీఐ మరింత గడువు కావాలని విజ్ఞప్తి చేసింది. దీంతో రాకేశ్ కుమార్ సీబీఐ కస్టడీని ఆగస్టు 28 వరకూ పొడిగించింది.