
బాలీవుడ్ సహకరించడం లేదు!
న్యూఢిల్లీ: గత నెల్లో సెన్సార్ బోర్డులో చవిచూసిన అవినీతిని అరికట్టడానికి బాలీవుడ్ నుంచి తగిన సహకారం లభించడం లేదని సీబీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మధ్య బాలీవుడ్ నిర్మాతల నుంచి సెన్సార్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాకేశ్ కుమార్ లంచం తీసుకుంటూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐకు బాలీవుడ్ నుంచి సహకారం లభించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుపై విచారణ మొదలుపెట్టి నెల కావొస్తున్నా.. దర్యాప్తు పూర్తి కావడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ కేసులో ముందుకు వెళ్లలేకపోవటానికి కారణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి తగిన సహకారం లభించకపోవడమేనని సీబీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ' ఈ తరహా లంచగొండి కేసులకు ఫిల్మ్ ఇండస్ట్రీ మాకు సహకారం అందించాలి. సీబీఐ ఏజెన్సీకి చిత్ర పరిశ్రమ నుంచి తగిన సాయం లభిస్తే సరైన కారణాన్ని కనుగొనడానికి ఆస్కారం ఉంటుంది' అని స్పష్టం చేశారు.
సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేముందు సీన్లను కత్తిరించకుండా యథావిధిగా ఉంచేందుకే పలు చిత్రాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీఈఓ రాకేశ్ కుమార్ లంచం తీసుకున్నాడని సీబీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక ప్రాంతీయ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రాకేశ్ కుమార్ రూ. 70 వేలు డిమాండ్ చేసి, ఆయన ఏజెంట్లు ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.