మెట్రో రైలు సాధ్యం కాదని ఎవరు చెప్పారు?
న్యూఢిల్లీ: విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం సాధ్యమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పారు. మెట్రో రైలు సాధ్యం కాదని ఎవరు చెప్పారని మీడియా ప్రతినిధులను ఆయన ఎదురు ప్రశ్నించారు. ఏపీ భవన్ లో ఉన్నతాధికారులతో బుధవారం సమావేశమయ్యారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ భవన్ ప్రక్షాళన, ప్రభుత్వంతో సమన్వయం, పెండింగ్ ప్రాజెక్టులతో సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు చట్టంలో అనేక అంశాలు పొందుపరిచారని చెప్పారు. వాటిని ఎలా అమలు చేయాలనే దానిపై నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ తయారు చేస్తుందన్నారు. దీని తర్వాత మన రాష్ట్రానికి వచ్చే సాయంపై స్పష్టత వస్తుందని తెలిపారు.