Vijayawada Metro Train
-
విజయవాడ మెట్రోరైలుకు కేంద్రం పచ్చజెండా
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లొచ్చని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. మొత్తం 25 కిలోమీటర్ల పొడవున రెండు లైన్లతో విజయవాడ మెట్రో రైలు నిర్మాణం అవుతుందని ఆయన వివరించారు. మెట్రో గురు ఇ. శ్రీధరన్ నేతృత్వంలో ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ విజయవాడ మెట్రో పనులను చేపట్టనున్న విషయం తెలిసిందే. తొలుత గుంటూరు - విజయవాడ మధ్య మెట్రో రైలు ఏర్పాటు చేయాలని భావించినా, అది ఆర్థికంగా అంత వెసులుబాటు కాదని నిపుణులు చెప్పడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. -
మెట్రో రైలు సాధ్యం కాదని ఎవరు చెప్పారు?
న్యూఢిల్లీ: విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం సాధ్యమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పారు. మెట్రో రైలు సాధ్యం కాదని ఎవరు చెప్పారని మీడియా ప్రతినిధులను ఆయన ఎదురు ప్రశ్నించారు. ఏపీ భవన్ లో ఉన్నతాధికారులతో బుధవారం సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ భవన్ ప్రక్షాళన, ప్రభుత్వంతో సమన్వయం, పెండింగ్ ప్రాజెక్టులతో సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు చట్టంలో అనేక అంశాలు పొందుపరిచారని చెప్పారు. వాటిని ఎలా అమలు చేయాలనే దానిపై నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ తయారు చేస్తుందన్నారు. దీని తర్వాత మన రాష్ట్రానికి వచ్చే సాయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. -
ఏపీ మెట్రో రైలు సలహాదారుగా శ్రీధరన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో చేపట్టనున్న విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు ముఖ్య సలహాదారుగా 'మెట్రోమాన్' ఇ. శ్రీధరన్ ను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన జీవో త్వరలో విడుదలకానుంది. తిరుపతిలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని శ్రీధరన్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్టు సమాచారం. కాగా విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. దీనికి సంబంధించి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీ బాధ్యతలను వీజీటీఎం ఉడాకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలో ఉడా అధికారులు టెండర్లు ఆహ్వానించారు.