
విభజనకు అనుకూలంగానే నా దీక్ష: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: అందరితో సంప్రదింపులు జరిపి రాష్ట్రాన్ని విభజించాలని కోరుతూ ఢిల్లీలో సోమవారం నుంచి తాను నిరవధిక దీక్ష తలపెట్టినట్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. సోమవారం నుంచి దీక్ష చేయనున్న నేపథ్యంలో ఢిల్లీలో ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై తెలంగాణ, సీమాంధ్ర, హైదరాబాద్ నగర నేతలతో విడివిడిగా, ఆ తరువాత సీమాంధ్ర, తెలంగాణ నేతలతో ఉమ్మడిగా ఆయన సమావేశమయ్యారు.
పార్టీ వర్గాల సమాచారం మేరకు... ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాను తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ఏమాత్రం వ్యతిరేకం కాదన్నారు. తన దీక్ష కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదని ఇదే సమావేశంలో పలుమార్లు చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ 2008లో తీసుకున్న నిర్ణయం, ప్రణబ్ కమిటీకి రాసిన లేఖ, ప్రధానికి రాసిన లేఖలు, అఖిలపక్షంలో చెప్పిన మాటల నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు పోనని, ఇప్పటి వరకూ తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, దీక్ష సమయంలో కూడా వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయనని చెప్పారు.
విభజనను ఆపాల్సిందిగా తాను కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్ చేయబోనని, ఇరు ప్రాంతాల జేఏసీలు, ప్రజా సంఘాల వారిని పిలిపించి చర్చలు జరపటంతో పాటు ఆందోళన చేస్తున్న సీమాంధ్ర వారికి న్యాయం చేయాల్సిందిగా మాత్రమే డిమాండ్ చేస్తానని చెప్పారు. ఈ దీక్షలో సీమాంధ్ర, తె లంగాణ ప్రాంత నేతలందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరారు. సీమాంధ్రలో రెండు నెలల కంటే ఎక్కువ సమయం నుంచి ప్రజలు ఆందోళనలో ఉన్నారని, అలాంటపుడు వారి ఆందోళన గురించి పట్టించుకోకపోతే పార్టీని వారు పట్టించుకునే అవకాశం ఉండదని చంద్రబాబు అన్నట్లు సమాచారం. చంద్రబాబు వివరణతో సంతృప్తి చెందిన తెలంగాణ నేతలు ఢిల్లీలో ఆయన చేసే దీక్షలో పాల్గొనేందుకు అంగీకరించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కలిసి చ ంద్రబాబు సోమవారం ఉదయం ఢిల్లీ వెళతారు. దీక్ష ప్రారంభించే ముందు వీలుంటే తాను లేదా పార్టీ ప్రజా ప్రతినిధులు రాష్ర్టపతి, ప్రధానిలను కలిసి ‘రాష్ట్ర విభజన చేయండి, అయితే అందరినీ సంప్రదించండి’ అంటూ వినతిపత్రం అందచేయనున్నారు.
జన సమీకరణకు ఏర్పాట్లు...
ఢిల్లీలో తాను చేసే దీక్షకు మద్దతుగా భారీ జన సమీకరణ చేయాల్సిందిగా నేతలకు చంద్రబాబు సూచించారు. వారం రోజుల పాటు నేతలందరూ ఢిల్లీలో ఉండేందుకు సిద్ధమై రావాలని, మీ మీ నియోజక వర్గాలు, జిల్లాల నుంచి ఢిల్లీ వెళ్లి నివాసం ఉంటున్న వారి వివరాలు సేకరించి వారు మద్దతు తెలిపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా నేతలకు బాధ్యతను అప్పగించారు. ప్రతి జిల్లా నుంచి రైళ్లలో ప్రజలు తరలి వచ్చేలా చూడాలని, ఇందుకు అవసరమైన ప్రత్యేక బోగీల ఏర్పాటును పార్టీ చూసుకుంటుందని చెప్పారు. ఆదివారం ఉదయం ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు మూడు అదనపు బోగీలు ఏర్పాటు చేయిస్తున్నామని, దీక్ష జరిగే సమయంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి మూడు ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరం నుంచి జన సమీకరణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా స్థానిక నేతలను ఆదేశించారు.
దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదు: సోమిరెడ్డి
చ ంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న దీక్ష తెలంగాణకు వ్యతిరేకంగా కాదని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన విషయంలో కేంద్రం అనుసరించిన వైఖరికి నిరసనగా దీక్ష చేస్తున్నారని, అందులో ఇరు ప్రాంతాల నేతలు పాల్గొంటారని చెప్పారు.