'ఆ మూడు నెలల నరకాన్ని మర్చిపోలేను' | Chhattisgarh girl: Can't forget those 3 months when I was raped daily | Sakshi
Sakshi News home page

'ఆ మూడు నెలల నరకాన్ని మర్చిపోలేను'

Published Thu, Jul 9 2015 6:27 PM | Last Updated on Tue, May 29 2018 11:17 AM

'ఆ మూడు నెలల నరకాన్ని మర్చిపోలేను' - Sakshi

'ఆ మూడు నెలల నరకాన్ని మర్చిపోలేను'

న్యూఢిల్లీ: ‘నా జీవితంలో ఆ మూడు నెలలు నేను అనుభవించిన నరకాన్ని నేనెప్పుడు మరచిపోలేను. ప్రతి రోజు నన్ను రేప్ చేశారు. అప్పుడప్పుడు గ్యాంగ్ రేప్ కూడా చేశారు. చెప్పినట్టు వినకపోతే రోహిత్ అనే యువకుడు బెల్టుతో, బూట్లతో బాదేవాడు. బ్లేడ్లతో హింసించేవాడు. నాది చత్తీస్‌గఢ్ రాష్ట్రం. నా కజినొకడు జష్‌పూర్ జిల్లాను చూపిస్తానని చెప్పి గతేడాది నన్ను తీసుకొని ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాకు తీసుకొచ్చాడు.

అక్కడ డబ్బుల కోసం రోహిత్ అనే యువకుడికి నా కజిన్ నన్ను అమ్మేశాడు. అక్కడ నన్ను రోహిత్, అతని స్నేహితులు గ్యాంగ్ రేప్ చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి ఓ ప్లేస్‌మెంట్ ఆఫీస్ అపార్ట్‌మెంట్‌లో నన్ను ఉంచారు. మూడు నెలలు నన్ను ఇష్టమొచ్చినట్లు వాడుకున్నారు. నాతో బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఆ నరక యాతనను నేనెప్పుడు మరువ లేను.

నా పరిస్థితి గురించి చత్తీస్‌గఢ్, ఢిల్లీ ముఖ్యమంత్రులకు రహస్యంగా లేఖలు రాశాను. జాతీయ మహిళా కమిషన్‌కు, ఢిల్లీ మహిళా కమిషన్‌కు, ఢిల్లీ పోలీసులకు కూడా లేఖలు రాశాను. ఎవ రువచ్చి నన్ను రక్షించలేదు. ఎవరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈలోగా నన్ను అమ్మిన నా కజిన్ ద్వారా నెనెక్కడున్నాననే విషయాన్ని నా తల్లిదండ్రులు తెలసుకున్నారు.

ఎలాగైనా నన్ను తీసుకొచ్చి అప్పగించాల్సిందిగా నా కజిన్‌పై ఒత్తిడి తెచ్చారు. దాంతో నా కజిన్ రోహిత్‌ను సంప్రదించాడు. 30 వేల రూపాలిస్తే నన్ను అప్పగిస్తామని రోహిత్, అతని మిత్రులు షరతు పెట్టారు. అలాగే జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవరికి కూడా చెప్పకూడదన్నారు. అన్నింటికి ఒప్పుకున్న మానాన్న ఓ సామాన్య రైతు. 30 వేల రూపాయలు చెల్లించడం కోసం తనకున్న పొలాన్ని, అమ్మ నగలను అమ్మి ఆ సొమ్ము చెల్లించి నన్ను విడిపించుకున్నారు. అంతటితో నా నరకయాతనకు తెరపడలేదు.

విలాస జీవితానికి అలవాటుపడ్డ రోహిత్ తన మిత్రులతో కలసి  కొంతకాలమైన తర్వాత మా ఊరికొచ్చారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు చూసి నన్ను కడ్నాప్ చేసి మళ్లీ ఢిల్లీ తీసుకొచ్చారు. ఈసారి డబ్బు సంపాదించేందుకు పెద్ద పథకం వేశారు. ఓ ఐశ్వర్యవంతుడి ఇంట్లో నన్ను పని మనిషిగా చేర్చారు. అతను రేప్ చేసినట్టు నాటకమాడమన్నారు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి అవకాశం చూసుకొని పారిపోయి ఇక్కడికొచ్చాను’ అని 23 ఏళ్ల ఆ యువతి ఢిల్లీలోని ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ కార్యాలయంలో తనకు జరిగిన దారుణాలను బుధవారం మీడియాకు తెలియజేశారు. ఆ ఎన్జీవో సహకారంతో ఆమె వెళ్లి నిందితులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆమె బచ్‌పన్ బచావో ఆందోళన్ సంస్థ సంరక్షణలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement