భారత్‌కు మళ్లీ చైనా షాక్!
బీజింగ్: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి, పాకిస్థాన్ ఉగ్రవాది మసూద్ అజార్ విషయంలో చైనా మరోసారి భారత్ వ్యతిరేక వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ వీటోను చైనా తాజాగా ఆరునెలలపాటు పొడిగించింది.
మసూద్‌ను ఉగ్రవాదిగా ఐరాస గుర్తించాలన్న భారత్ తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో సాంకేతికంగా నిలిపివేసింది. ఈ వీటో గడువు సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చైనా అభ్యంతరం చెప్పకుంటే భారత్ తీర్మానం దానంతటదే ఆమోదం పొందేది. కానీ చైనా తన వీటోను ఇంకో ఆరు నెలలు కొనసాగించాలని నిర్ణయించినట్టు ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ షుయంగ్ మీడియాకు తెలిపారు. భారత్ తీర్మానంపై ఇప్పటికీ విభిన్న అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో సంబంధిత పక్షాలు మరింతగా సంప్రదింపులు జరిపేందుకు వీలుగా తన వీటోను పొడిగించినట్టు చెప్పుకొచ్చారు.
ఐరాస భద్రతా మండలిలో చైనాకు వీటో అధికారం ఉన్న సంగతి తెలిసిందే. భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉండగా.. చైనా మినహాయించి 14 సభ్యదేశాలు భారత్ తీర్మానానికి మద్దతు తెలిపాయి. అజార్‌పై నిషేధం విధించాలంటూ భద్రతా మండలి ఆంక్షల కమిటీకి భారత్ చేసుకున్న దరఖాస్తును అవి సమర్థించాయి. చైనా మాత్రం తన అక్కసును చాటుకుంటూ భారత్ తీర్మానన్ని అడ్డుకుంది.