మొండి చైనాకు మరోసారి భారత్ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: ఉగ్రవాద సూత్రధారి మసూద్ అజార్ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తున్న చైనాకు ఈ విషయంలో అధికారికంగా విజ్ఞప్తి చేయాలని భారత్ నిర్ణయించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితిలో చైనా సంగతి తెలిసిందే. ఈ విషయంలో పాకిస్థాన్‌కే కొమ్ముకాస్తూ.. తాజాగా తన వీటో గడువును ఆరు నెలలపాటు కొనసాగించింది.
వచ్చేవారం గోవాలో జరగనున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో మసూద్ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి, ఉడీ ఉగ్రవాద దాడి వెనుక సూత్రధారిగా భావిస్తున్న మసూద్ అజార్‌ను అంతర్జాతీయంగా నిషేధించాల్సిందేనని భారత్ కోరుతూ వస్తున్నది. మసూద్‌ను ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించాల్సిందేనని, అలా చేయకపోతే ప్రమాదకర సంకేతాలు వెళ్లే అవకాశముంటుందని భారత విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ గురువారం విలేకరులతో పేర్కొన్నారు. ఉగ్రవాదంపై సంకుచిత దృక్పథం కలిగి ఉండటం అంతర్జాతీయ సమాజానికి శ్రేయస్కరం కాదని చెప్పారు. మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా ఉగ్రవాద సంస్థలకు గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుందని ఆయన పేర్కొన్నారు.
మసూద్‌ను ఉగ్రవాదిగా ఐరాస గుర్తించాలన్న భారత్ తీర్మానాన్ని తన వీటో అధికారంతో సాంకేతికంగా నిలిపివేసిన చైనా.. ఈ వీటో గడువు ఇటీవల ముగియడంతో ఆరునెలల పాటు కొనసాగించింది. ఐరాస భద్రతా మండలిలో చైనాకు వీటో అధికారం ఉంది. భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉండగా.. చైనా మినహాయించి 14 సభ్యదేశాలు భారత్ తీర్మానానికి మద్దతు తెలిపాయి. అజార్‌పై నిషేధం విధించాలంటూ భద్రతా మండలి ఆంక్షల కమిటీకి భారత్ చేసుకున్న దరఖాస్తును అవి సమర్థించాయి.