అమెరికాకు చైనా వార్నింగ్
అమెరికాకు చైనా వార్నింగ్
Published Mon, Oct 24 2016 4:41 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
న్యూఢిల్లీ, బీజింగ్ల మధ్యనున్న సరిహద్దు సమస్యలో మధ్యలో తలదూర్చవద్దని అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చైనీస్ బోర్డర్కు పక్కనే ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ పర్యటించిన అనంతరం, బీజింగ్ ఈ హెచ్చరికలు చేసింది. అమెరికా చేస్తున్న ఈ కార్యకలాపాలు ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను మరింత జటిలం చేయడమేనని, విద్రోహ శాంతిని రెచ్చగొట్టడేమనని విమర్శించింది. "ఏ ప్రాంతానైతే మీ సీనియర్ దౌత్య అధికారి సందర్శించారో, ఆ ప్రాంతం చైనా, భారత్లకు మధ్య వివాదాస్పదమైన రీజియన్గా ఉంది. చైనా, భారత్ వివాదాస్పదమైన ప్రాంతంలో అమెరికా రాయబారి సందర్శించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం" అని చైనా విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ మీడియా ముందు వెల్లడించారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వాయువ్యంలో ఉన్న తవాంగ్ పట్టణం స్థానిక సంప్రదాయ జానపద పండుగ ఉత్సవాలను ఇటీవలే ఘనంగా నిర్వహించింది. ఈ ఫెస్టివల్కు అమెరికా రాయబారి వర్మ హాజరయ్యారు. ఈ ప్రాంతానే దక్షిణ టిబేట్గా చైనా పిలుచుకుంటోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లా తమదేనని చైనా వాదిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య నెలకొంది. అమెరికా రాయబారి ఈ ప్రాంతాన్ని సందర్శించడం సరిహద్దు ప్రాంతంలో వివాదాన్ని మరింత జఠిలం చేయడమేనని, శాంతి హరించి, సరిహద్దు ప్రాంతంలోని ప్రశాంతత వాతావరణానికి హానికలిగించడమేనని లూ వ్యాఖ్యానించారు.
చైనా, భారత్ల మధ్య ఉన్న సరిహద్దు సమస్యల్లో అమెరికా తలదూర్చడాన్ని ఆపివేయాలని తాము కోరుతున్నట్టు లూ పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి అమెరికా కట్టుబడి ఉండాలని తెలిపారు. మూడో పార్టీ ప్రమేయంతో సరిహద్దు సమస్యలు మరింత సెన్సిటివ్గా మారే అవకాశముందని లూ భయాందోళ వ్యక్తంచేశారు. ఇరుదేశాల సంప్రదింపులతో ప్రాదేశిక వివాదాలను పరిష్కరించుకోవాలని తాము ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ వివాదాలను భారత్, చైనాలు సమసిపోయేలా చేసుకోగలవని విశ్వసిస్తున్నట్టు లూ ఆశాభావం వ్యక్తంచేశారు.
Advertisement