ఆ రోబో నడకతో అదరగొట్టింది
బీజింగ్: నడవడంలో తనకు తిరుగులేదని తాజాగా చైనా రోబో నిరూపించుకుంది. 50 గంటల్లో ఏకంగా 134 కిలోమీటర్లు నడిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. గతంలో అమెరికా రోబో 30 గంటల్లో 65 కిలోమీటర్లు నడిచి గిన్నిస్‌లో చోటు సాధించగా.. ఆ రికార్డును చైనా రోబో చెరిపేసింది.
చైనాలోని చాంగ్‌క్వింగ్ యూనివర్సిటీ ఆఫ్ పోస్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌కు చెందిన పరిశోధకులు జంతువును పోలినవిధంగా నాలుగు కాళ్ల రోబోను తయారు చేశారు. దీనికి 'జింగ్‌ఝె నెంబర్ 1' అని పేరు పెట్టారు. ఈ రోబో గత నెల 24న సర్కిల్ ఇండోర్ ట్రాక్‌లో 134.03 కిలోమీటర్ల దూరాన్ని 54 గంటల సమయంలో నడించింది. గంటకు 0.8 కిలోమీటర్ల వేగంతో ఈ దూరాన్ని అధిగమించిందని చైనా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ జిన్హుహా తెలిపింది. తద్వారా అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన 'రెంజర్' రోబో కన్నా రెండురెట్లు అధిక దూరాన్ని నడిచి.. 'జింగ్‌ఝె నెం.1' ఈ రికార్డు సాధించింది. ఈ రోబోను తయారీని ఏడాదిలోగా పూర్తిచేశామని చైనా పరిశోధకుడు ప్రొఫెసర్ లీ క్వింగ్‌డు తెలిపారు.