చో రామస్వామి కన్నుమూత
- ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖుల సంతాపం
చెన్నై: తమిళుల్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన అమ్మ మరణం నుంచి అక్కడి ప్రజలు కోలుకోకముందే... తమిళ ప్రజలు విపరీతంగా అభిమానించే రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ నటుడు, పత్రికా సంపాదకుడు, చో రామస్వామి కన్నుమూశారు. 82 ఏళ్ల ఈ కురు వృద్ధుడు బుధవారం ఉదయం 4.40 గంటల ప్రాంతంలో స్థానిక అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొద్ది కాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 29వ తేదీన తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన్ను స్థానిక అన్నాశాలై రోడ్డు, గ్రీమ్స్ రోడ్డులో గల అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
ఆ సమయంలో దివంగత ముఖ్యమంత్రి, ఆయన్ని రాజకీయ గురువుగా భావించే జయలలిత అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె తుది శ్వాస విడిచిన సంగతి చో రామస్వామికి తెలియదు. తనకు అత్యంత ఆప్తురాలైన జయలలిత కన్ను మూసిన మూడవ రోజే చో రామస్వామి వైద్య చికిత్స పొందుతూ కన్ను మూయడం గమనార్హం.
రాష్ట్ర ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగరరావు, ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం, డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంకే.స్టాలిన్, కనిమొళి, అళగిరి, ఎండీఎంకే నేత వైగో, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్, సూపర్‌స్టార్ రజనీకాంత్, అజిత్, సూర్య, కార్తీ, తదితర ప్రముఖులు చో రామస్వామి భౌతిక కాయానికి నివాళులర్పించారు. చో రామస్వామి పార్థివ దేహానికి బుధవారం సాయంత్రం 4.30 ప్రాంతంలో స్థానిక బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రామస్వామి ప్రముఖ నటి రమ్యకృష్ణకు మేనమామ కూడా. జయలలితతో పాటు ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులతో కలసి పలు సినిమాల్లో నటించారు.14 చిత్రాల్లో హీరోగాను, మరికొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడిగాను నటించారు. పలు నాటకాలు వేశారు. మహాభారతం, వాల్మీకి రామాయణం, నానేరాజా రచనలు ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి. వి.కృపలానీ, ఇందిరాగాంధీ, మొరార్జీదేశాయ్, కరుణానిధి, చరణ్ సింగ్, కామరాజర్, ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్, వాజ్‌పేయి, అద్వానీ, మోదీ వంటి రాజకీయ నేతలతోనూ చో కు సత్సంబంధాలున్నాయి.
ప్రముఖుల సంతాపం: ‘చో రామస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎవ్వరికీ భయపడని వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులకు, తుగ్లక్ పాఠకులకు నా ప్రగాఢ సంతాపం’అని ప్రధాని మోదీ ట్వీటర్‌లో పేర్కొన్నారు.
చో రామస్వామి మృతికి జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్ : ప్రఖ్యాత జర్నలిస్టు చో రామస్వామి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సంతాపాన్ని ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా రామస్వామి చేసిన రాజీలేని పోరాటం, నాటక రచనలో ఆయన ప్రతిభ, జర్నలిస్టుగా పదునైన వ్యంగ్యపూరిత వ్యాఖ్యలు ఆయన జీవితంలో కలికి తురారుు వంటివని జగన్ నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.
చో గురించి సంక్షిప్తంగా..
పేరు: శ్రీనివాస అయ్యర్ రామస్వామి
జన్మస్థలం: చెన్నైలోని మైలాపూర్
పుట్టిన తేదీ: అక్టోబర్ 5, 1934
విద్యాభ్యాసం: మద్రాస్ యూనివర్సిటీ
భార్య: సౌందర్య
సంతానం: శ్రీరామ్, సింధుజ
తొలి వృత్తి: న్యాయవాది (1957-1962)
బహుముఖ ప్రజ్ఞ: రచన, నటన, దర్శకత్వం, జర్నలిజంలలో ప్రతిభ
పేరు ప్రతిష్టలు తెచ్చిన నాటకం: తుగ్లక్
స్థాపించిన పత్రిక: తుగ్లక్ (1970)
అవార్డులు: భగవాన్‌దాస్ గొయెంకా
రాజ్యసభ సభ్యత్వం: 2005-2009