తెలుగునాట జాతీయ కాంగ్రెస్‌ను సవాలు చేస్తూ నలభై ఏళ్ళ క్రితం ‘తెలుగుదేశం’ (1982) ప్రాంతీయ పార్టీగా ఏర్పడితే, అప్పటి నుంచి వరసగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (2001) ‘ప్రజా రాజ్యం’ (2008) ‘వైఎస్సార్ కాంగ్రెస్’ (2011) ‘జనసేన’ (2014) ప్రాంతీయ పార్టీలుగా ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజన (2014) జరిగాక, మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి ‘టీఆర్‌ఎస్’, రెండో ఎన్నికల్లో ‘టీడీపీ’ని ఓడించి ‘వైఎస్సార్‌సీపీ’ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చాయి. అయితే, ఇప్పుడవి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, వాటికి ఒక సొంత రాజకీయ జాగా (పొలిటికల్ స్పేస్) ఉంది. దాన్ని– కాంగ్రెస్, కమ్యూనిస్టు, తెలుగుదేశం నుంచి అవి తీసు కున్నాయి. ఈ కాలంలో ఉత్తర భారత దేశంలో పలు రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీ. కులాలు ముస్లిం మైనార్టీతో కలసి కొన్ని ప్రభుత్వాలు ఏర్పడడం చూశాం. కానీ ఇక్కడ ఈ వర్గాలు తమదైన జాగాను సృష్టించుకోలేకపోయాయి.
అయితే, 1991లో దేశంలో మొదలైన ఆర్థిక సంస్కరణలతో వచ్చిన– సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకర ణలలో నుంచి వచ్చిన అస్తిత్వ వాదన దళిత స్పృహకు తోడై 1994 నాటికి రాష్ట్రంలో ‘మాదిగ దండోరా’ ఉద్యమం మొదలయింది. ఇలా ‘ప్రాంతాల’ విభజన ఉద్యమాల మధ్య, ఉప–కులాల విభజన ‘డిమాండ్’ వచ్చింది. తొంభై దశకంలో మొదలైన ‘మండల్’ తర్వాత వరసగా కనిపిస్తున్న చిన్న రాష్ట్రాలు, వర్గీకరణ వంటి ‘డిమాండ్ల’ ఒత్తిడి మధ్య 2004 నాటికే కాంగ్రెస్ సంకీర్ణ రాజకీయాలతో ఉనికిలో నిలవడానికి సిద్ధమయింది. చివరికి రాష్ట్ర విభజనతో ఏపీకి పరి మితమైన ‘టీడీపీ’ది కూడా ఇప్పుడు అదే పరిస్థితి.
అలా చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నాయకుడికి,మరో రెండు పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకునే సర్దుబాటుతో సంకీర్ణ ప్రభుత్వానికి సిద్ధమైతేగాని, చిన్న రాష్ట్రంలో కూడా గెలుపు సాధ్యం కాలేదు. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ళలోనే కాంగ్రెస్, కమ్యూనిస్టులు తమ ఉనికిని కోల్పోయారు. ఈ రాజకీయ శూన్యత పూరించడానికి సిద్ధమైన మూడవ ప్రత్యామ్నాయం ఏది? మండల్ తర్వాత బీసీల రాజకీయ సర్దుబాటు అంటే, దాన్ని కొంతమేర అర్థం చేసుకోవచ్చు. కానీ, 80లలో దళిత మహాసభ, 90లలో ‘మాదిగ దండోరా’ రెండూ అప్పటి అధికార పక్షాల మీద పోరాటం చేసికూడా అవి తమదైన రాజకీయ జాగాను ఎందుకు ఇప్పటికీ స్థిరపర్చుకోలేక పోయాయి? సరే, అవి విఫలమైతే, ఆ ‘జాగా’ ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉన్నట్టు? ఇది ఒక అంశం అయితే, ‘దండోరా’కు సుప్రీం కోర్టు తీర్పు పరిష్కారం ఇచ్చాక అయినా, మాల–మాదిగలు కలసి తమ ఎదురుగా కనిపిస్తున్న ‘రాజకీయ జాగా’ను పసిగట్టి, అందుకు అనుగుణంగా వ్యూహాలు ఎందుకు మార్చుకోలేపోతున్నారు? అందుకు సిద్ధం కావడానికి 2029 వరకూ ఉన్న వ్యవధి వీళ్ళిద్దరికీ చాలదా? లేక
తెలంగాణలో కాంగ్రెస్ ద్వారా ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క (ఎస్సీ – మాల) ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు, ఇదే తమ వ్యూహం, రేపు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రూపంలో తమకు అప్పగిస్తుంది అనే ఆశ వారికి ఉన్నదా? అనే సందేహాలు కలుగుతాయి. అయినా ఎన్నికలు ముగిసిన అరు నెలలకే ఇటువంటివి ఆలోచించడానికి కారణం లేకపోలేదు. దక్షిణాదిలోకి ప్రవే శానికి భారతీయ జనతా పార్టీ హైదరా బాద్ ‘సిటీ’ ద్వారా... తెలంగాణను ఇప్పటికే లక్ష్యం చేసుకుంది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో 2024 నాటికి ‘సంకీర్ణం’ పేరుతో టీడీపీ గరిష్ఠ స్థాయిలో సర్దుబాటు చేసుకుని సరిపెట్టుకోవలసిన పరిస్థితిని ‘ఎన్డీఏ’ స్వయంగా పర్యవేక్షించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా ఐదేళ్ళ వ్యవధి ఉన్నప్పటికీ, ఢిల్లీ నుంచి పెరుగుతున్న రాజకీయ ఒత్తిడితో కావొచ్చు, పరిపాలన
కంటే, రాజకీయ క్రియాశీలతను పెద్దదిగా చూపడానికిప్రాధాన్యత కని పిస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల వచ్చిన ‘ఎస్సీ’ వర్గీకరణ ఒక్కటే కాకుండా, నియోజకవర్గాల పునర్వర్గీకరణ వీరికి పొంచి ఉన్న మరో రాజకీయ అనివార్యత అయింది. ఈ నడుమ జనాభా లెక్కల సేకరణ పూర్తి అయితే, వర్ధమాన రాజకీయ ఆశావహులకు తాజా ‘డేటా’ వారి డిమాండ్‌కు కొత్త కొలమానం అవుతుంది.
వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment