దాల్చినచెక్కతో మధుమేహం నియంత్రణ!
న్యూయార్క్: వంటగదిలో అతి సాధారణ దినుసు అయిన దాల్చినచెక్క మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుందట. టైప్2 మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెరల నియంత్రణకు ఇది బాగా ఉపయోగపడుతోందని కాలిఫోర్నియాలోని వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. పరిశోధనలో భాగంగా.. 543 మంది టైప్2 మధుమేహ రోగుల్లో కొంతమందికి దాల్చినచెక్కను రోజుకు 120 మిల్లీగ్రాముల నుంచి 6 గ్రాముల వరకూ మాత్రల రూపంలో ఇచ్చారు. మరికొంత మందికి నకిలీ మాత్రలు ఇచ్చారు.
త ర్వాత ఫలితాలను పరిశీలించగా.. దాల్చిన చెక్క మాత్రలు తీసుకున్నవారి రక్తంలో చక్కెరల స్థాయి మిగతావారికన్నా మెరుగ్గా నియంత్రణలో ఉన్నట్లు తేలింది. ఇన్సులిన్ హార్మోన్ విడుదల, పనితీరును దాల్చినచెక్క ప్రభావితం చేయడం వల్లే చక్కెరల స్థాయి మెరుగుపడుతున్నట్లు గుర్తించారు. అలాగే చెడు కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్)ను, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంతోపాటు మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచడంలో కూడా దాల్చినచెక్క దోహదపడినట్లు గమనించారు. అయితే టైప్2 మధుమేహ రోగులకు కచ్చితంగా ఎంత మోతాదు దాల్చినచెక్కను ఇవ్వాలన్న దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.