
స్టార్టప్‌లకు ఊపిరి ‘నె ట్ న్యూట్రాలిటీ’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్‌నెట్ సేవల్లో ఆటంకాలను సృష్టించేలా ఉన్న టెలికం సంస్థల ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాదని, అందరికీ సమానంగా ఇంటర్‌నెట్ (నెట్ న్యూట్రాలిటీ) సేవలు అందించాలని నోలారిటీ కమ్యూనికేషన్స్ సీఈవో అంబరీష్ నారాయణ్ గుప్తా డిమాండ్ చేశారు. ఇంటర్ నెట్ సేవలు స్టార్టప్ కంపెనీలకు ప్రాణవాయువు లాంటిదనీ, ప్రభుత్వ విధానాలు దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా ఉండాలన్నారు. హైదరాబాద్‌లో బుధవారం నాస్కామ్ నిర్వహించిన ‘ప్రోడక్ట్ కాన్‌క్లేవ్’లో ఆయన సంధానకర్తగా వ్యవహరిస్తూ స్టార్టప్ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేశారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రాబోయే రోజుల్లో మార్కెట్ రూపురేఖల్ని పూర్తిగా మార్చబోతోందని, నెట్ న్యూట్రాలిటీతోనే ఈ రంగంలో వ్యాపార అవకాశాలను ఒడిసిపట్టుకోవచ్చని లౌడ్‌సెల్ అధినేత రమేష్ గుప్తా చెప్పారు.
ఐదేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు...
టెక్నాలజీ ఆధారిత డిజిటల్ స్టార్టప్ కంపెనీల ఏర్పాటులో ఇండియా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని, వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు నాస్కామ్ ప్రోడక్ట్ కౌన్సిల్ చైర్మన్ రవి గురురాజ్ తెలిపారు. ప్రస్తుతం 850 టెక్నాలజీ ప్రోడక్ట్ స్టార్టప్‌లు దేశంలో పనిచేస్తున్నాయని, 2020 నాటికి వీటి సంఖ్య 11, 500 కు చేరుకుంటుందన్నారు.
భవిష్యత్తు నవీకరణలదే...
స్టార్టప్ రంగంలో కొత్త ఉత్పత్తులను రాబోయే తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించేవారికే మార్కెట్ ఉంటుందని అట్యూన్ సంస్థ వ్యవస్థాపకుడు అరవింద్ కుమార్ తెలిపారు. సృజనాత్మక ఆలోచనలతో వచ్చే వారికి నిధుల సమస్య లేదని, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్, హెడ్జ్ ఫండ్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇన్‌టెన్స్ టెక్ వ్యవస్థాపకుడు సీకే శాస్త్రి చెప్పారు.