
'అకాల' మృతులకు రూ.5 లక్షలు నష్టపరిహారం
గడిచిన రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాలవర్షాలతో పంట, ఆస్తి నష్టపోయిన రైతులు, ప్రజలను అన్నివిధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. బాధితులను ఆదుకునే విషయంలో మానవత్వంతో వ్యవహరిస్తామన్నారు. అకాల వర్షాల కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. జిల్లాల వారిగా పంట, ఆస్తి నష్టం వివరాలను తక్షణమే సేకరించాలని అధికారులను ఆదేశించారు.
వర్షం కారణంగా వాణిజ్యపంటలతోపాటు కూరగాయలు, పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. భారీ వర్షం కారణంగా పలు జిల్లాల్లోని రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ , నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అకాల వర్షాలు తీవ్రం ప్రభావం చూపాయి. దాదాపు 50 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా. కోట్లలో ఆస్తి నష్టం ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.