
అధికారం కాదు.. ప్రజలే శాశ్వతం
‘‘రాజకీయ పార్టీలొస్తాయి.. పోతాయి.. అధికారం కాదు.. తెలంగాణ రాష్ట్రం, ప్రజలే శాశ్వతం. వారికి సేవలందించడం ఉద్యోగి ధర్మం’’అని సీఎం కేసీఆర్ అన్నారు.
- పార్టీలొస్తాయి.. పోతాయి: సీఎం కేసీఆర్
- ప్రజలకు సేవలందించడం ఉద్యోగుల ధర్మం.. అధికారులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి
- సమన్వయంతో పనిచేస్తే రాష్ట్రాభివృద్ధిని ఎవరూ ఆపలేరు
- సింగరేణి, విద్యుత్ ఉద్యోగులను కాపాడుకుంటాం
- ఉద్యోగులు అప్పుడప్పుడు డిమాండ్ల కోసం కొట్లాడతారు అయితే తెగేదాకా లాగొద్దు.. ఒకటికి పదిసార్లు చర్చించుకుని సమస్య పరిష్కరించుకోవాలి
- హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజకీయ పార్టీలొస్తాయి.. పోతాయి.. అధికారం కాదు.. తెలంగాణ రాష్ట్రం, ప్రజలే శాశ్వతం. వారికి సేవలందించడం ఉద్యోగి ధర్మం. అధికారులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని సమన్వయంతో పనిచేస్తే తెలంగాణ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సింగరేణి, విద్యుత్ ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. తాను విద్యుత్ ఉద్యోగుల పక్షపాతినని వ్యాఖ్యానించారు.
రైతులు, ప్రజలకు సేవ చేసేందుకు అహర్నిశలుగా పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం తెలంగాణ విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు ప్రగతిభవన్‌లో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టిన ఘనత తొలుత విద్యుత్ శాఖకే దక్కుతుందన్నారు.
‘‘ప్రభుత్వంతో ఉద్యోగులు అప్పుడప్పుడు డిమాండ్ల కోసం కొట్లాడుతరు. అయితే తెగేదాన్క లాగడం మంచిది కాదు. పని బంద్ చేసి కూసుంటమంటే ఎట్ల? ఇప్పుడే తెలంగాణ మంచి పేరు తెచ్చుకుంటంది. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని మరింత పెంచుకోవాలె గాని.. పని బంద్ చేసి పాడు చేసుకుంటామా? ఒక్కసారి కాకపోతే పది మాట్ల చర్చించుకోవాలె. సమస్యలు పరిష్కరించుకోవాలె..’’అని ఉద్యోగులకు హితవు పలికారు.
తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాడి ప్రభుత్వాన్ని స్థాపించాక కూడా భావితరాల కోసం తండ్లాడుతున్నాని, ఈ బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు. గత పాలకులు ఉద్యోగుల సమస్యలను తేలిగ్గా చూసి మరింత జఠిలం చేసేవారని, ఏ ఉద్యోగ సంఘంతోనూ ఘర్షణకు దిగే సంప్రదాయానికి తాము వ్యతిరేకమన్నారు. ‘‘వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న మనమంతా సహచరులం. రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా అందరం సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం అయినా అటెండర్ అయినా చిత్తశుద్ధితో పనిచేయాల్సిందే..’’అని అన్నారు. హీరో ఒక్కడే కాకుండా మిగిలిన నటులు కూడా ఎవరి పాత్రలు వారు పోషిస్తేనే సినిమా హిట్ అవుతందని, అదే విధంగా రాష్ట్రాభివృద్ధికి కింది స్థాయి ఉద్యోగి నుంచి సీఎం వరకు అందరూ కష్టపడి పనిచేయాలన్నారు.
సంతోషంగా పని చేస్తేనే మంచి ఫలితాలు
ఉద్యోగులకు కడుపు నిండా పెట్టాలి.. ఆడుతుపాడుతూ వారితో పనిచేయించుకోవాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, హోంగార్డులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచామన్నారు. మానవీయ కోణంలో విద్యుత్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయిస్తే కొందరు వంకలు పెట్టి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఉద్యోగ సంఘాలు చొరవ తీసుకుని ఈ ప్రక్రియకు సహకరించాలని కోరారు.
వచ్చే మార్చిలోగా క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దుష్ప్రవర్తన ఆరోపణలపై ఎవరైనా ఉద్యోగులను సస్పెండ్ చేసి ఉంటే మానవీయ దృక్పథంతో ఎత్తివేయాలని అధికారులకు సూచించారు. ఉద్యోగి మెడ మీద కత్తి పెట్టి పనిచేయిచడం కంటే సంతోషంగా పనిచేసే అవకాశం కల్పించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ట్రాన్‌సకో, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ శర్మ, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్‌రావు, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి తదితరులు పాల్గొన్నారు.