
త్వరలో విద్యుత్ శాఖ ఖాళీల భర్తీ: కేసీఆర్
విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు.
విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖపై ఆయన మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నిరంతర విద్యుత్ అందిస్తామని చెప్పారు. వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు అంచనాలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.
డిమాండు ఉంటే ఆగస్టులో పరిశ్రమలకు ఒకరోజు పవర్ హాలిడే ఇచ్చి వ్యవసాయానికి సరఫరా చేస్తామని కేసీఆర్ చెప్పారు. రెండు ఫీడర్లుగా విభజించి ఒకదానికి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరో ఫీడర్కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. వరంగల్ కేంద్రంగా నడుస్తున్న నార్త్ డిస్కమ్కు శ్రీ రాజరాజేశ్వరి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా పేరు నిర్ణయించారు. అలాగే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సదరన్ డిస్కమ్కు వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరును ఖరారు చేశారు.