నూతన సంవత్సరం తొలిరోజున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బిజీబిజీగా గడిపారు.
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం తొలిరోజున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బిజీబిజీగా గడిపారు. సీఎంను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రముఖులతో క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు సందడి నెలకొంది. ఉదయం నుంచే పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రముఖులు సీఎంను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ దేవస్థానాల నుంచి వచ్చిన పండితులు సీఎంను ఆశీర్వదించారు.
సాయంత్రం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ నుమాయిష్ (ఎగ్జిబిషన్)ను సీఎం ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని, పోచారం, చందూలాల్, తుమ్మల, ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి, మహేందర్‌రెడ్డి, జోగురామన్న, తలసాని, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ చక్రపాణి, సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు సీఎంను కలిశారు.
లక్ష్యానికి తగిన విద్యుత్
శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన విద్యుత్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఈ ఏడాది తొలి సమీక్ష నిర్వహించారు. రైతులకు వచ్చే ఖరీఫ్ నుంచి పగటిపూట తొమ్మిది గంటలు, ఇతర వర్గాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,445 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని, ఈ ఏడాది చివరి నాటికి మరో 4,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యానికి తగినట్లుగా పనులు చేయాలని ఆదేశించారు. భూపాలపల్లిలో 600 మెగావాట్ల యూనిట్‌ను ఈనెల 5న ప్రారంభించడంతో పాటు ఏప్రిల్ నాటికి జైపూర్ నుంచి సింగరేణి ప్లాంట్ ద్వారా 1,200 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అధికారులు సీఎంకు వివరించారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి రావాల్సిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ కూడా ఈ ఏడాది చివరినాటికి అందుతుందని... ఏప్రిల్ నాటికే 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీంతో బీహెచ్‌ఈఎల్ ద్వారా నిర్మించే విద్యుత్ ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకోవాలని సీఎం పేర్కొన్నారు. నిర్ణీత లక్ష్యాల మేరకు విద్యుత్ అధికారులు పనిచేస్తున్నారని అభినందించారు.
టీజీవో డైరీ ఆవిష్కరణ
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీని క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, టీజీవో నేత మమతతో పాటు సంఘం నాయకులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్‌కు శుభాకాంక్షలు సీఎం
కేసీఆర్ శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లక్ష్యాలన్నీ విజయవంతం కావాలని, ప్రజలంతా ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు.