గ్యాంగ్‌ నయీమ్‌ | 5 Telangana police officers to be suspended for their nexus with gangster Nayeem | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌ నయీమ్‌

Published Fri, May 12 2017 2:35 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

గ్యాంగ్‌ నయీమ్‌ - Sakshi

గ్యాంగ్‌ నయీమ్‌

ఐదుగురు ఖాకీల సస్పెన్షన్‌
మరో 20 మంది పోలీసు అధికారుల విచారణ..
ఆరోపణలు రుజువైతే వారిపైనా వేటు
అప్పటివరకు విధుల నుంచి తొలగించి వీఆర్‌లో ఉంచాలని డీజీపీ ఆదేశం
సస్పెండ్‌ అయినవారిలో అదనపు ఎస్పీ, ఇద్దరు ఏసీపీలు


సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కేసులో పోలీస్‌ అధికారులపై ఎట్టకేలకు వేటు పడింది! నయీమ్‌తో చేతులు కలిపి కోట్లు గడించిన ఖాకీలపై పోలీస్‌ శాఖ కొరడా ఝళిపించింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 25 మంది పోలీస్‌ అధికారులపై డీజీపీ అనురాగ్‌ శర్మ చర్యలు తీసుకున్నారు. వారిలో ఐదుగురిపై సస్పెన్షన్‌ వేటు వేయగా, మిగతావారిపై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలతోపాటు విచారణకు ఆదేశిస్తూ గురువారం ఆదేశాలు వెలువరించారు.

ప్రభుత్వంపైనే ఒత్తిడి
కిందటేడాది ఆగస్టు 8న మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ శివారులో నయీమ్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడి ఆస్తులు, దందాలు, సెటిల్‌మెంట్లు, భూకబ్జాలపై ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే విచారణ నుంచి తప్పించుకునేందుకు, సస్పెన్షన్‌ వేటు పడకుండా ఉండేందుకు పలువురు అధికారులు ఏకంగా ప్రభుత్వంపైనే ఒత్తిడి తెచ్చారు. కొన్నాళ్లపాటు నయీమ్‌ కేసు మూతపడిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే పోలీస్‌ ఉన్నతాధికారులు రెండ్రోజుల క్రితం ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

నయీమ్‌ తో అంటకాగిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి పొందినట్టు తెలిసింది. వారిపై చర్యలు తీసుకోకుంటే పోలీస్‌ విభాగంపైనే అపవాదు ఉండిపోతుందని,నయీమ్‌తో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా పదోన్నతుల్లో అందలం ఇచ్చారన్న ఆరోపణలెదుర్కోవడం ప్రభుత్వానికి కూడా మంచిది కాదని ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి.

ఆరోపణలు రుజువైతే వేటే..
నయీమ్‌తో కలిసి సెటిల్‌మెంట్లు చేయించుకోవడం, ఫ్లాట్లు గిఫ్టులుగా పొందడం, లంచాలు తీసుకోవడం.. తదితర కార్యక్రమాలకు అలవాటుపడ్డ వారిపై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీ ఆదేశించారు. అప్పటివరకు వారిని విధుల్లో నుంచి తొలగించి వీఆర్‌లో పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. విచారణలో ఆరోపణలు రుజువైతే వారిపై కూడా సస్పెన్షన్‌ వేటు వేయాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

విచారణ ఎదుర్కోవాల్సిన అధికారులు వీరే..
ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ చంద్రశేఖర్, మహబూబ్‌నగర్‌ ట్రైనింగ్‌ కాలేజీ డీఎస్పీ సాయి మనోహర్, ఇల్లందు డీఎస్పీ ప్రకాశ్‌రావు, జెన్‌కో డీఎస్పీ వెంకట నర్సయ్య, పోలీస్‌ అకాడమీలో ఉన్న డీఎస్పీ అమరేందర్‌రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న, మలక్‌పేట్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి, హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్, ఇన్‌స్పెక్టర్‌ కిషన్, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికిరణ్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య, టాస్క్‌ఫోర్స్‌ నార్త్‌జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ బల్వంతయ్య, ఇన్‌స్పెక్టర్‌ రవీందర్, ఇన్‌స్పెక్టర్‌ సూర్యప్రకాశ్, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌నాయుడు, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్‌ మాజిద్, హెడ్‌కానిస్టేబుళ్లు ఆనంద్, మహ్మద్‌ మియా, కానిస్టేబుల్‌ బాలయ్య.

పదోన్నతుల ముందు కలకలం
రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేసింది. ఇన్‌స్పెక్టర్‌ నుంచి నాన్‌ క్యాడర్‌ ఎస్పీ వరకు పదోన్నతుల ప్రక్రియను పోలీస్‌ శాఖ ఇప్పటికే వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో నయీమ్‌ కేసులో అంటకాగిన అధికారులకు కూడా పదోన్నతులు కల్పిస్తే పోలీస్‌ శాఖ నైతిక విలువ దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రహించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ వర్గాలతో చర్చించారు. కేవలం 25 మంది అధికారుల వల్ల మిగిలినవారికి అన్యాయం చేసిన వారిమవుతామని వివరించినట్టు తెలిసింది. దీనితో వీరి సస్పెన్షన్, విచారణ నిర్ణయంతో పదోన్నతులకు సైతం లైన్‌క్లియర్‌ అయ్యిందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీఎస్పీ పదోన్నతులు కల్పించి, తదుపరి దశలో డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీ, నాన్‌ క్యాడర్‌ ఎస్పీ పదోన్నతులు కల్పించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.

మా దగ్గర ఆధారాలున్నాయి
నయీమ్‌తో అంటకాగినట్టు ఆరోపణలు మోపి చర్యలు తీసుకున్న అధికారుల ఎదుట త్వరలోనే అసలు అధికారులకు సంబంధించిన అధారాలు పెడతామని సస్పెన్షన్‌కు గురైన పలువురు అధికారులు స్పష్టం చేశారు. తాము మాత్రమే సస్పెన్షన్‌కు గురవడం, మిగతా వారికి ఎలాంటి సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం సరి కాదని, తామేమీ నయీమ్‌తో వ్యక్తిగత పనులు చేయించుకోలేదని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టులను ఏరివేసేందుకు నయీమ్‌ను పెంచి పోషించిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోకపోవడం పారదర్శకమైన చర్య ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. త్వరలోనే పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామని పలువురు అధికారులు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement