ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య జరిగిన సమావేశంలో మాట్లాడిందొకటైతే, బయటకు లీక్ చేసిన విషయాలు వేరా? అంటే అవుననే అంటున్నాయి ఏఐసీసీ వర్గాలు.
* రాహుల్ ముందు జీ హుజూర్
* బయటికేమో చాంపియన్‌లా పోజు
* సమైక్యవాదం విన్పించానంటూ లీకులు
* అనుమతితో వెనుదిరిగి.. అసంతృప్తి అంటూ కలరింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య జరిగిన సమావేశంలో మాట్లాడిందొకటైతే, బయటకు లీక్ చేసిన విషయాలు వేరా? అంటే అవుననే అంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో మొదలైన చర్చను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి, దానికి ఎలా ముగింపు పలకాలన్న దానిపై కిరణ్‌కు రాహుల్ మార్గనిర్దేశనం చేయగా, బయటికి మాత్రం అందుకు భిన్నంగా లీకులిచ్చారు. రాహుల్‌తో భేటీలో కిరణ్ గట్టిగా సమైక్య వాదన విన్పించారంటూ ప్రచారంలో పెట్టారు.
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పార్టీ ఎన్నికల వ్యూహరచన కోసం కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో రాహుల్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. కిరణ్‌తో పాటు 12 రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, కపిల్ సిబల్, కేవీ థామస్, నారాయణ స్వామిలతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్రం నిర్ణయాలు, ప్రజల్లోకి వెళ్లడం, ప్రధానంగా రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలపై సీఎంలు వివరించారు.
అనంతరం వారితో రాహుల్ విడిగా సమావేశమై కొన్ని ఆదేశాలిచ్చారు. ఆ కోవలోనే దిగ్విజయ్ సమక్షంలోనే కిరణ్‌తో భేటీ అయి ఇక్కడి విషయాలను ఆరా తీశారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో అనుసరిస్తున్న వ్యూహమేంటని కూడా అడిగి తెలుసుకున్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయంపై ఎలాంటి భిన్నాభిప్రాయాలూ రాకుండా రాష్ట్రపతి నిర్దేశించిన గడువులోగా బిల్లును తిప్పిపంపేలా చూడాలని ఈ సందర్భంగా కిరణ్‌ను రాహుల్ ఆదేశించారు. తర్వాత అందరు సీఎంల సమక్షంలో రాహుల్ మీడియాతో మాట్లాడారు.
కిరణ్ మాత్రం అందులో పాల్గొనకుండా హైదరాబాద్ తిరుగుముఖం పట్టారు. ఆ తర్వాత కాసేపటికే, రాహుల్‌తో భేటీలో కిరణ్ గట్టిగా సమైక్యం గళం వినిపించారని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆయనకు చెప్పారని చానళ్లలో విస్తృతంగా ప్రచారమైంది. పైగా విభజన నిర్ణయానికి నిరసనగానే రాహుల్ మీడియా భేటీలో పాల్గొనకుండా కిరణ్ వెనుదిరిగారని కూడా ప్రచారం జరిగింది. దాంతో హైదరాబాద్‌లోని సీనియర్ నాయకులు హస్తినలోని ఏఐసీసీ నేతలకు, ముఖ్యంగా దిగ్విజయ్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు.
దాంతో, రాహుల్‌తో భేటీలో జరిగిన దానికి పూర్తి విరుద్ధంగా కిరణ్ మీడియా లీకులిచ్చిన వైనం ఏఐసీసీ నేతల దృష్టికి వెళ్లింది. విభజన బిల్లుపై అసెంబ్లీలో జరిగే చర్చలో అందరూ పాల్గొనేట్టు చూడాలన్నది ముఖ్యమైన ఆదేశమని, దాన్ని సజావుగా పూర్తి చేయడంలో తనకు కొన్ని ఇబ్బందులున్నందున సమైక్యం కోసం కట్టుబడ్డానని చెప్పక తప్పదని, ఈ విషయంలో తనకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలని కిరణ్ కోరినట్టు తెలిసింది.
ఏఐసీసీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... విభజనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, వెనక్కు వెళ్తే దేశవ్యాప్తంగా పార్టీ విశ్వసనీయత కోల్పోతుందని కిరణ్‌తో రాహుల్ స్పష్టం చేశారు. విభజన వల్ల రాజకీయంగా నష్టపోతామని చెబుతున్న ప్రాంతంలో అనుసరించాల్సిన కార్యాచరణను అధిష్టానం రూపొందించిందని, రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఇలా విభజనపై అనుసరించాల్సిన వ్యూహంపై కిరణ్‌తో 40 నిమిషాల భేటీలో రాహుల్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఏఐసీసీ ముఖ్యుడొకరు చెప్పారు. వాటి అమలులో తలెత్తే ఇబ్బందుల నుంచి బయట పడటానికే కిరణ్ ఇలా ‘సమైక్య’ లీకులిచ్చారని అభిప్రాయపడ్డారు.
సమైక్య చాంపియన్ అన్పించుకోవాలన్న కిరణ్ యత్నాలు కూడా హైకమాండ్ వ్యూహంలో భాగమేనని ఎందుకనుకోరని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పడం విశేషం! పైగా చిన్ననాటి స్నేహితుడి ఇంట్లో పెళ్లి ఉందని, దానికి తాను తప్పనిసరిగా హాజరవాల్సి ఉందని రాహుల్‌కు చెప్పి, ఆయన అనుమతి తీసుకుని మరీ కిరణ్ హైదరాబాద్ బయల్దేరారని సదరు నేత వివరించారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ హైటెక్స్‌లో వివాహానికి హాజరవడానికే కిరణ్ త్వరగా వెళ్లారు తప్ప ఏదో సమైక్యం, విభజనవాదమంటూ మీరే ఏదేదో ఊహించుకుంటే ఎలాగంటూ ఏఐసీసీ కార్యాలయ వర్గాలు స్పందించాయి.
మీడియా సమావేశంలో కిరణ్ పాల్గొనకపోవడాన్ని ఒక విలేఖరి ప్రస్తావించగా రాహుల్ కూడా ఇదే మాట చెప్పారు. సన్నిహితుల ఇంట్లో శుభకార్యానికి హాజరు కావాల్సి ఉన్నందున అనుమతి తీసుకునే ఆయన హైదరాబాద్ వెళ్లారని స్పష్టంగా చెప్పారు. అధిష్టానాన్ని ధిక్కరించినట్టుగా మాట్లాడుతున్నా కిరణ్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు గనుకనే రకరకాల ప్రచారాలు జరుగుతుండవచ్చని ఏఐసీసీ కార్యాలయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఒక కీలక నిర్ణయాన్ని కార్యరూపంలో పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు తమ వ్యూహం తమకుంటుందని చెప్పాయి. షిండే, దిగ్విజయ్‌లతో భోజన విరామంలో కిరణ్ కాసేపు సమావేశమయ్యారు.
పథకాలపై ప్రసంగం
అమ్మ హస్తం, మీసేవ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, బంగారు తల్లి పథకాలపై సీఎంల భేటీలో కిరణ్ మాట్లాడారు. అమ్మహస్తం ద్వారా అర్హులకు నెలకు సరిపడే నిత్యావసరాలను తక్కువ ధరకు ఇస్తున్నామన్నారు.