ముంబై: ఎఫ్‌ఎంసీజీ మేజర్ కోల్‌గేట్-పామోలివ్ ఇండియా 2016-17సంవత్సరానికి క్యూ4 ఫలితాలు ప్రకటించింది. మార్చి 31 ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ .143 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. . కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 142.58 కోట్ల నికర లాభం ఆర్జించామని కాల్గేట్-పామోలివ్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ తెలిపింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 244 కోట‍్లను నివేదించింది.
మొత్తం ఆదాయం రూ. 1177 కోట్లను తాకింది. ప్రకటనల వ్యయాలు 24 శాతం పెరిగి రూ. 144 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 22.1 శాతం నుంచి 23.7 శాతానికి బలపడ్డాయి. అయితే అమ్మకాల పరిమాణం 3 శాతం క్షీణించినట్లు కంపెనీ తెలియజేసింది. టూత్‌పేస్ట్ మార్కెట్ వాటా మాత్రం 47 శాతం నుంచి 55 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది.
గత క్వార్టర్‌లో లిక్విడిటీ క్రంచ్ ప్రభావం నుంచి నాలుగవ త్రైమాసికంలో రికవరీ సాధించామని కోల్‌గేట్ పామోలివ్ (ఇండియా) ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసాం బచలాని ఫలితాల వెల్లడి సందర్భంగా పేర్కొన్నారు. మొత్తం 2015-16 ఆర్థిక సంవత్సరంలో 581 కోట్ల లాభాలతో పోటిస్తే, ప్రస్తుతంరూ. 578 కోట్ల నికర లాభాలను సాధించినట్టు పేర్కొన్నారు. ఈ ఫలితాల నేపథ్యంలో కోల్‌గేట్ 2శాతంపైగా నష్టపోయింది