రాజధాని శంకుస్థాపనకు రండి
* జాతీయ నేతలు, ప్రముఖులకు సీఎం ఆహ్వానం
* 22న ప్రధానమంత్రి వస్తామన్నారు : చంద్రబాబు
* జగన్, కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నా
* సోనియాగాంధీకి ఆహ్వానం పంపించా
* రాజధాని నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రావాలంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం పలువురు జాతీయ నేతలు, ప్రముఖులను ఆహ్వానించారు. స్వచ్ఛభారత్ సబ్ గ్రూప్ కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు..
ఈ విభాగం రూపొందించిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసేందుకు బుధవారం ఢిల్లీకి వచ్చారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. రాజధాని శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలపైన చర్చించారు. శంకుస్థాపనకు రావాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తును ఆహ్వానించారు. అనంతరం ఏపీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 22వ తేదీన జరిగే రాజధాని శంకుస్థాపనకు వస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారన్నారు.
బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీని కూడా కలిసినట్లు తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. శంకుస్థాపనకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహా అందరినీ ఆహ్వానిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆహ్వానం పంపామని చెప్పారు. నా రాజధాని, మన రాజధాని అన్న భావన రావాలని, ప్రజలంతా ఇందులో భాగస్వాములు కావాలని అన్నారు. శంకుస్థాపనకు దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలు, నదుల నుంచి నీరు, మట్టి తెస్తామని, దీన్నొక పవిత్ర సంగమంగా చేస్తామనిఅన్నారు. అమరావతి ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటి కావాలని అన్నారు.
ప్రజల అలవాట్లలో మార్పు రావాలి
స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతమ్వాలంటే నిధుల్లో 20 శాతం పైనే ఖర్చు చేసి, ప్రజల్లో అవగాహన పెంచాలని బాబు చెప్పారు. ప్రజల అలవాట్లలో మార్పు రావాలన్నారు. స్వచ్ఛ భారత్ కోశ్ ఫండ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకు పెట్రోల్, డీజిల్, టెలికాం సర్వీసులపై సెస్ వేయొచ్చని సూచించినట్లు చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నిధులను ఈ మిషన్‌కు వెచ్చించాలని కోరామాన్నారు. వ్యర్థాల నిర్వహణను ఒక సమీకృత వ్యవస్థలా రూపొందించాలని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక హోదా, ప్యాకేజీపై చర్చించాం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం అందించేందుకు నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ రూపొందిస్తుందని చెప్పారు. ‘‘నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అమెరికాలో ఉన్నారు. ఈరోజు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి నృపేందర్ మిశ్రాకు గుర్తు చేశాం. దీనిపై వర్కవుట్ చేస్తామన్నారు’’ అని తెలిపారు. ఇప్పటివరకు ఈ దిశగా ఒక్క సమావేశం కూడా జరగలేదని గుర్తు చేయగా.. వారు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు అని బదులిచ్చారు.
కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రితో పెండింగ్ అంశాలపై చర్చించామన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కూడా చర్చించామని చెప్పారు. ప్రధాని నుంచి ఎలాంటి సానుకూల ప్రకటనను ఆశిస్తున్నారు అని ప్రశ్నించగా ‘‘ఆంధ్రప్రదేశ్ పసిబిడ్డ. ఒక్కో సమస్యను అధిగమించి అనేక సంస్థలను సాధించుకున్నాం. కొన్ని మనం ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తున్నాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.