
బైక్ 1 భలే..
చూడ్డానికి మామూలు సైకిల్‌లాగేనే కనిపిస్తున్నా.. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధ్యక్షుడు ఒబామా కోసం తయారుచేసిన సైకిల్. చిలీకి చెందిన ఆక్స్‌ఫర్డ్ కంపెనీ దీన్ని రూపొందించింది.
ఇంతకీ ఎందుకు: గల్ఫ్ యుద్ధం జరిగి 24 ఏళ్లవుతున్న సందర్భంగా నాటి యుద్ధానికి స్మారకంగా సదరు కంపెనీ బైక్ 1ను ఒబామాకు పంపుతోంది.
ప్రత్యేకతలు: 8 గేర్లు, బుల్లెట్ ప్రూఫ్ టైర్లు, ఒబామా ఉపయోగించే బ్లాక్‌బెర్రీ ఫోన్ చార్జ్ చేసుకునేందుకు చార్జింగ్ పాయింట్, ఎల్‌ఈడీ లైట్లు, గ్రీజు, ఆయిల్ అవసరం లేని చెయిన్ వ్యవస్థ. అన్నింటికన్నా ముఖ్యంగా ‘న్యూక్లియర్ బటన్’. ఒబామా ఎక్కడికెళ్లినా, అతనితోపాటు న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ ఒకటి ఉంటుంది. అందులో దేశ అణ్వాయుధాలను ప్రయోగించడానికి ఉపయోగించే లాంచింగ్ కోడ్స్ ఉంటాయి. బైక్ 1లోనూ ఆ బ్రీఫ్‌కేస్ పెట్టుకోవచ్చు.
కొసమెరుపు: చమురు కోసం నాడు జరిగిన గల్ఫ్ యుద్ధానికి గుర్తుగా.. ఒబామాకు త్వరలో బైక్ 1 ను పంపనున్న ఆక్స్‌ఫర్డ్.. పనిలోపనిగా అమెరికా విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ.. చురకలేసింది. ఒబామా దీన్ని విరివిగా ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూలమైన రవాణా విధానాలకు మరింత ప్రాచుర్యం తెస్తారని ఆశిస్తున్నామని చెబుతూ.. ‘‘మనమందరమూ సైకిల్‌నే ఉపయోగిస్తే.. భవిష్యత్తులో చమురు కోసం యుద్ధాలు జరగనే జరగవు’’ అంటూ చిన్నగా వాతపెట్టింది.