అతడో కంప్యూటర్ ఇంజనీర్. చేస్తున్న ఉద్యోగానికి తోడు డబ్బు సంపాదన కోసం ఆన్లైన్లో వెండి ట్రేడింగ్ చేసేవాడు. అందులో 7 లక్షల నష్టం వచ్చింది. దాన్ని పూడ్చుకోడానికి మద్యం అక్రమ రవాణాలోకి దిగాడు! చివరకు పోలీసులకు చిక్కాడు!! ఢిల్లీ నుంచి హర్యానాకు అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న అతగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వినోద్ అలియాస్ భోలు (25) హర్యానా నివాసి. 2010 సంవత్సరంలో అతడు ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఈమధ్యకాలంలో అతడు మద్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. తాను గత రెండేళ్లుగా హర్యానా నుంచి ఢిల్లీకి మద్యం రవాణా చేస్తున్నట్లు వినోద్ పోలీసులకు తెలిపాడు.
గతంలో తాను ఆన్లైన్లో వెండి ట్రేడింగ్ చేసేవాడినని, అందులో ఏడు లక్షల రూపాయల నష్టం రావడంతో అప్పులు తీర్చడానికి ఇలా మద్యం అక్రమ రవాణా మార్గాన్ని ఎంచుకున్నానని అతడు చెప్పినట్లు అదనపు పోలీసు కమిషనర్ (క్రైం బ్రాంచి) రవీంద్ర యాదవ్ తెలిపారు. మద్యం రవాణా చేస్తూ ఏదైనా వాహనం పట్టుబడితే దాన్ని విడిపించుకోవడం అసాధ్యమని.. ఎప్పుడూ ఫైనాన్స్ చేసిన వాహనాలనే ఉపయోగించేవాడు.
గతంలో 2011లో కూడా మద్యం రవాణా కేసులో అరెస్టయ్యాడు. బాగా అర్ధరాత్రిపూట మాత్రమే ప్రయాణాలు చేసేవాడని, కొన్నిసార్లు హర్యానా తిరిగి వెళ్లేటప్పుడు దారిలో ప్రయాణికుల నుంచి డబ్బు తీసుకుని ఎక్కించుకునేవాడని పోలీసులు తెలిపారు. కొన్నాళ్ల తర్వాత అలా ఎక్కించుకున్న ప్రయాణికులను దోచుకోవడం కూడా మొదలు పెట్టాడట!! అతడితో పాటు ఇంకా ఎవరెవరు ఈ గ్యాంగులో ఉన్నారో అందరినీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అప్పులు తీర్చడానికి మద్యం అక్రమ రవాణా: కంప్యూటర్ ఇంజనీర్ అరెస్టు
Published Wed, Nov 6 2013 9:40 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement