నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన
గుంటూరు: నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ శుక్రవారం ముగిసింది. రెండురోజుల్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ కమిటీ జూలై 29 నుంచి 31 వరకు మూడు రోజులపాటు అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థల నాయకులను విచారించింది. శుక్రవారం గుంటూరులో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఇన్‌చార్జి వీసీ కె.ఆర్.ఎస్.సాంబశివరావు, రిజిస్ట్రార్ రాజశేఖర్‌లతో సమావేశమైన కమిటీ వారి నుంచి వివరాలు సేకరించింది.
రెండురోజుల్లో ప్రభుత్వానికి నివేదిక...
రిషితేశ్వరి కేసులో మూడు రోజులపాటు అధికారులతోపాటు అనేకమందిని విచారించాం. కీలకమైన వివరాలు, డాక్యుమెంట్లను సేకరిం చాం. విద్యార్థులకు పది రోజులపాటు సెలవులివ్వడంతో వారు లేకుండా విచారణ జరుపుతున్నారనే ఆరోపణల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళతాం. సర్కారు అనుమతిస్తే విద్యార్థులు కళాశాలలకు తిరిగి వచ్చాక విచారణ చేపడతాం. రెండురోజుల్లో సమగ్ర నివేదికను అందజేస్తాం.
- బాలసుబ్రహ్మణ్యం, కమిటీ చైర్మన్