కర్ణాటకలో బీజేపీకి షాక్!
బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పట్టు చాటుకుంది. కర్ణాటకలోని ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండటంతో ఈ ఉప ఎన్నికను ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీజేపీ సవాలుగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించినా బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణులకు షాక్ ఇచ్చింది. రెండుస్థానాల్లోనూ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది.
సిట్టింగ్ స్థానమైన నంజన్‌గూడ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ కేశవన్‌మూర్తి 21వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ తరఫున మాజీ మంత్రి వీ శ్రీనివాస్ ప్రసాద్ బరిలోకి దిగినప్పటికీ గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. మరో సిట్టింగ్ స్థానం గుండ్లుపేటలోనూ కాంగ్రెస్ పార్టీ పదివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గీత మహదేవ ప్రసాద్ బీజేపీ అభ్యర్థి సీఎస్ నిరంజనకుమార్‌ను ఓడించారు.
దేశవ్యాప్తంగా బీజేపీ హవా!
దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. ఈ ఎన్నికల్లో బీజేపీ హవా చాటింది. మొత్తంగా ఆరు స్థానాల్లో గెలుపు దిశగా బీజేపీ సాగుతుండగా.. కర్ణాకటలోని రెండు స్థానాల్లో పాగావేసే దిశగా కాంగ్రెస్ పార్టీ సాగుతోంది. పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంది.
ఉప ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి.
- మధ్యప్రదేశ్ బాంధవ్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థి శివనారాయణ్‌సింగ్ విజయం. అటేర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధిక్యం
- అసోం ధేమలీ ఉప ఎన్నికలో బీజేపీ విజయం. కాంగ్రెస్ అభ్యర్థి బాబుల్ సోనోవాల్‌పై బీజేపీ నేత రోనోజ్ పెగు గెలుపు
- రాజస్థాన్ ధోల్‌పూర్‌లో విజయం దిశగా దూసుకుపోతున్న బీజేపీ అభ్యర్థి శోభారాణి కుశ్వాహ
- హిమాచల్ ప్రదేశ్ భోరాంజ్‌లో 8433 ఓట్లతో బీజేపీ అభ్యర్థి అనిల్ ధిమన్ విజయం
- పశ్చిమబెంగాల్ కాంతి దక్షిణ్ స్థానంలో టీఎంసీ అభ్యర్థి చంద్రిమా భట్టాచార్య విజయం. రెండోస్థానంలో బీజేపీ
- జార్ఖండ్ లితిపరాలో జార్ఖండ్ ముక్తి మోర్చా ఆధిక్యం