హిమాచల్‌ సీఎంగా సుఖు | Sukhwinder Singh Sukhu To Be New Himachal Pradesh Chief Minister | Sakshi
Sakshi News home page

హిమాచల్‌ సీఎంగా సుఖు

Published Sun, Dec 11 2022 3:51 AM | Last Updated on Sun, Dec 11 2022 3:51 AM

Sukhwinder Singh Sukhu To Be New Himachal Pradesh Chief Minister - Sakshi

సిమ్లా/కలబుర్గి (కర్ణాటక): హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్‌సింగ్‌ సుఖును కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక చేసింది. గత అసెంబ్లీలో విపక్ష నేతగా కొనసాగిన ముకేశ్‌ అగ్నిహోత్రి (60) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తీవ్ర మల్లగుల్లాలు, గత 24 గంటల్లో ఏకంగా రెండుసార్లు కాంగ్రెస్‌ శాసనసభా పక్ష భేటీ తదితరాల అనంతరం అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

పార్టీ కేంద్ర పరిశీలకునిగా వచ్చిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగెల్, భూపీందర్‌సింగ్‌ హుడా, రాజీవ్‌ శుక్లా శనివారం సీఎల్పీ తాజా భేటీ అనంతరం మీడియాకు ఈ మేరకు వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వెలిబుచ్చారు. ఆదివారం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఆయనతో పాటు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రా తదితరులు ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 68 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 40 సీట్లు గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించడం తెలిసిందే. గురువారం ఫలితాలు వెలువడ్డప్పటి నుంచే సీఎం పదవి కోసం కాంగ్రెస్‌ నేతల్లో తీవ్ర పోరు నెలకొంది. మాజీ సీఎం వీరభద్రసింగ్‌ భార్య, పీసీసీ చీఫ్‌ ప్రతిభా సింగ్‌ తదితర ఆశావహులంతా విఫలయత్నం చేశారు. 58 ఏళ్ల సుఖు తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీకి సారథ్యం వహించారు. దిగువ హిమాచల్‌ ప్రాంతం నుంచి సీఎం అవుతున్న తొలి కాంగ్రెస్‌ నేత ఆయనే. సుఖ్వీందర్‌ సీఎం కానున్నట్టు తెలియగానే హమీర్పూర్‌ జిల్లాలోని సొంతూరు నదౌన్‌లో, అక్కడి ఆయన నివాసంలో సంబరాలు మొదలయ్యాయి.

హిమాచలే ఆదర్శం: ఖర్గే
కలబుర్గి: హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను వచ్చే ఏడాది కర్నాటకలో పునరావృతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులకు ఖర్గే పిలుపునిచ్చారు. 10 సూత్రాల ప్రణాళిక ద్వారా మనం హిమాచల్‌లో మంచి మెజారిటీతో నెగ్గామని చెప్పుకొచ్చారు.

కౌన్సిలర్‌ నుంచి సీఎం వరకు.. 
అంచెలంచెలుగా ఎదిగిన పోరాట యోధుడు  కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ నాయకుడి నుంచి ముఖ్య మంత్రి వరకు సుఖ్విందర్‌ సుఖు అంచెలంచెలుగా ఎదిగారు. సిమ్లాలో వార్డు కౌన్సిలర్, యువజన విభాగం అధ్యక్షుడు,  హమీర్పూర్‌ జిల్లా నాదౌన్‌ ఎమ్మెల్యే, తర్వాత పీసీసీ అధ్యక్షుడు, ఇప్పుడు సీఎం.. ఇలా అన్ని స్థాయిల్లో పదవుల్ని చేపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అత్యంత చరిష్మా ఉన్న దివంగత సీఎం వీరభద్రసింగ్‌ ప్రత్యర్థిగా ఉంటూనే పార్టీలో స్వయంశక్తితో ఎదిగారు. ఈ ఎన్నికల్లో పార్టీ ప్రచార కమిటీకి నేతృత్వం వహించి విజయతీరాలకు చేర్చారు. నాదోన్‌ నుంచి బీజేపీ అభ్యర్థి విజయ్‌ అగ్నిహోత్రికి మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వంటి హేమాహేమీల ప్రచారాన్ని తట్టుకుని మరీ గెలిచారు.

1964 మార్చి 27న నాదోన్‌లో సాధారణ కుటుంబంలో సుఖు జన్మించారు. తండ్రి రషీల్‌ సింగ్‌ రాష్ట్ర రవాణా కార్పొరేషన్‌లో డ్రైవర్‌. విద్యార్థిగా ఫీజుల కోసం సిమ్లాలో పాలమ్మేవారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశాక కాంగ్రెస్‌లో చేరారు. 1989 నుంచి ఆరేళ్ల పాటు విద్యార్థి నేతగా చురుగ్గా ఉన్నారు. 1998 నుంచి పదేళ్లు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర చీఫ్‌గా చేశారు. 1992, 1997ల్లో సిమ్లా కార్పొరేషన్లో కౌన్సిలర్‌గా నెగ్గారు.

2003లో నాదౌన్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వరసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీపై ఆయనకున్న పట్టు, కార్యక్రమాల నిర్వహణ సామర్థ్యాన్ని గుర్తించిన అధిష్టానం 2013లో పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఆరేళ్లపాటు పీసీసీ చీఫ్‌గా ముఠా సంస్కృతిని ప్రోత్సహించకుండా కార్యకర్తలతో, నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడని పేరుంతివే ఆయన్ను సీఎం పీఠానికి దగ్గర చేశాయి. వీరభద్రసింగ్‌ భార్య ప్రతిభా సింగ్‌ను కాదని మరీ 25 మంది ఎమ్మెల్యేలు సుఖుకే మద్దతు పలికారంటే ఆయనకున్న మంచిపేరే కారణం. అందుకే అధిష్టానం సుఖు నాయకత్వ సామర్థ్యానికే ఓటేసింది.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement