తెలంగాణ ప్రాంతానికి సీఎం ఎవరూ లేరని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ శనివారం న్యూఢిల్లీలో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో కిరణ్ ఫోటోలు పెట్టవద్దని ఆయన తెలంగాణ ప్రజలకు సూచించారు. తెలంగాణ ప్రాంతంలోని టీడీపీ నేతలు ఇప్పటికైనా ఆ పార్టీ వీడాలని ఆయన హితవు పలికారు.
తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత దయాకరరావుని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ విమర్శించడం పట్ల ఎంపీ రాజయ్య శనివారం న్యూఢిల్లీలో మండిపడ్డారు. దయాకరరావు గురించి మాట్లాడే స్థాయి సీఎంకు లేదని రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని సీఎం రమేష్కు రాజయ్య ఈ సందర్బంగా హితవు పలికారు.
తెలుగుదేశం పార్టీలో అర్హత లేని వ్యక్తులకు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారంటూ సీఎం రమేష్పై ఎర్రబెల్లి దయాకరరావు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో సీఎం రమేష్కు చెందిన కాంట్రాక్ట్లను అడ్డుకుంటామని ఆయన వెల్లడించారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలను సీఎం రమేష్ ఖండించారు. ఎర్రబెల్లికి చదువు సంస్కారం లేవని సీఎం రమేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.