మోదీ 'మన్ కీ బాత్' నిలిపేయండి
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకులు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీం జైదీని ఆయన కార్యాలయంలో కలిశారు. బీహార్ ఎన్నికలు పూర్తయ్యే వరకు మన్ కీ బాత్ కార్యక్రమం నిలిపి వేయాలని వారు ఈ సందర్భంగా సీఈసీని కోరారు.
నరేంద్ర మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేడియోలో వివిధ అంశాలపై శ్రోతలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా సందేశం ఇస్తున్న సంగతి తెలిసిందే. బీహార్ ఎన్నికల నేపథ్యంలో మన్ కీ బాత్ కార్యక్రమం ఆ రాష్ట్ర ప్రజలపై పడే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు బుధవారం సీఈసీని కలిశారు. అయితే కాంగ్రెస్ చేసిన విన్నపాన్ని సీఈసీ సున్నీతంగా తిరస్కరించినట్లు సమాచారం.
బీహార్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 శాసన సభ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ఐదు దశలలో జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలు అక్టోబర్ 12 న మొదలై.... తుది ఎన్నికలు నవంబర్ 5 తేదీతో ముగుస్తాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 8వ తేదీన ప్రకటిస్తారు.