
ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాల్సిందే
న్యూఢిల్లీ: పోలీసు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పు పార్లమెంటు ఔన్నత్యానికి భంగకరమని వివిధ రాజకీయ పక్షాలు అభిప్రాయపడ్డాయి. ఈ తీర్పునకు కారణమైన ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపాయి. ఎంపీలకుగానీ, ఎమ్మెల్యేలకుగానీ ఏదైనా క్రిమినల్ కేసులో రెండేళ్లకన్నా ఎక్కువ శిక్ష పడితే.. తక్షణమే వారు వారి పదవులకు అనర్హులవుతారంటూ కోర్టు వెల్లడించిన తీర్పును సైతం రాజకీయపక్షాలు తప్పుపట్టాయి. ప్రజా ప్రతినిధులపై ఈ తీర్పు ప్రభావం లేకుండా చేసేందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్న ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. మంగళవారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో బీజేపీ, లెఫ్ట్, బీఎస్‌పీ, ఎస్పీ తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు వెల్లడించిన పెరైండు కీలక తీర్పులతోపాటు అరెస్టయి ఒక్కరోజు పోలీసుల అదుపులో ఉన్నా సదరు వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడంటూ పాట్నా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఎయిమ్స్ ఫ్యాకల్టీ నియామకాల్లో రిజర్వేషన్లు, ప్రతిపాదిత జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్’ బిల్లుపై ఈ భేటీలో చర్చించారు. జ్యుడిషియల్ కమిషన్ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాలని అఖిలపక్షం ప్రభుత్వాన్ని కోరింది. హర్యానాలో వాద్రా భూముల కొనుగోలు అంశాన్ని బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ సమావేశంలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించకూడదంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో పార్లమెంటు ఔన్నత్యం దెబ్బతినకుండా చూసేందుకు తగిన చర్యలు చేపట్టాలని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని అఖిల పక్షం కోరిందని భేటీ అనంతరం మంత్రి కమల్‌నాథ్ చెప్పారు. ప్రస్తుత సమావేశాల్లోనే జ్యుడిషియల్ కమిషన్ బిల్లును ప్రవేశపెట్టాలని వివిధ పార్టీల నేతలు కోరినట్లు వివరించారు.
ఇటలీ వాళ్లకో న్యాయం.. మనకో న్యాయమా: సుష్మ
అఖిలపక్ష భేటీలో ఇటీవల కోర్టులు వెలువరించిన తీర్పులను చర్చించినట్లు బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ విలేకరులకు చెప్పారు. ‘కోర్టు తీర్పు ప్రకారం పోలీసు కస్టడీలో ఒక్కరోజు ఉన్నా ఓటేయడానికి వీల్లేదు. ఎన్నికల నామినేషన్ వేయడానికి వీల్లేదు. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికి మేం మద్దతు తెలిపాం. ఎందుకంటే ఇదే న్యాయవ్యవస్థ... జాలర్ల హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇటలీ నావికులను ఓటేసేందుకు వారి దేశానికి పంపింది. కానీ మనదేశంలో ఒక్కరోజు అరెస్టయిన ఆ వ్యక్తి ఓటేయడానికి వీల్లేదు.. పోటీ చేయడానికి వీల్లేదట! ఇది సరికాదు’ అని ఆమె అన్నారు.
కాంగ్రెస్-బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్: ఏచూరి
సభలో ప్రజా సమస్యలు ప్రస్తావన కు రాకుండా కాంగ్రెస్-బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయని సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆరోపించారు. సభ సజావుగా నడవాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని పేర్కొన్నారు.