ఐదేళ్ల సర్వీసుంటే క్రమబద్ధీకరణ!
త్వరలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్
సాక్షి, హైదరాబాద్: కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా కాంట్రాక్టు ఉద్యోగులను ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకొన్న కొద్దీ దశల వారీగా క్రమబద్ధీకరిస్తారు. అయితే 2014 జూన్ 1వ తేదీ (రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రోజు) నాటికి కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉండి.. ఇప్పటికీ కొనసాగుతున్నవారికే దీనిని వర్తింపజేస్తారు. దీనికి సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి 8 మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది.
ఆ మార్గదర్శకాల ప్రకారం... ఆయా శాఖల్లో సంబంధిత కేటగిరీలో రెగ్యులర్ పోస్టు ఖాళీగా ఉండాలి. ఆ ఉద్యోగి నెలనెలా ఫుల్‌టైమ్ స్కేల్ జీతం పొంది ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుకు సరిపడే విద్యార్హత, వయసు ఉండాలి. మొత్తంగా ఐదేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. ఉద్యోగి సర్వీసు లెక్కించేటప్పుడు విద్యా, సంక్షేమ శాఖల్లో మాత్రమే సంవత్సరాంతపు సెలవులను పరిగణనలోకి తీసుకుంటారు. అనధికారిక గైర్హాజరు, క్రమశిక్షణా రాహిత్యం వంటివాటిల్లో ఈ మినహాయింపు ఉండదు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన నాటి నుంచి ఈ రెగ్యులరైజేషన్ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
ఐదేళ్లు ఎప్పుడు నిండితే..
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ఉద్యోగంలో ఉండి.. ఐదేళ్ల సర్వీసు నిండని కాం ట్రాక్టు ఉద్యోగులను క్రమపద్ధతిలో రెగ్యులరైజ్ చేస్తారు. ఈ ఐదేళ్లు నిండే వరకు వారి ని కాంట్రాక్టు ఉద్యోగులుగానే పరిగణిస్తారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకే ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారు, ప్రత్యేక ప్రాజెక్టులు, స్కీముల కింద పనిచేస్తున్న కాం ట్రాక్టు ఉద్యోగులకు వర్తించదు. వారి విషయాన్ని ఆలోచిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించారు.
రిజర్వేషన్ల సర్దుబాటుకు బ్యాక్‌లాగ్
మార్గదర్శకాలకు లోబడి అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల ప్రతిపాదనలను సంబంధిత శాఖ కార్యదర్శి బిజినెస్ రూల్స్ ప్రకారం ఆర్థిక శాఖ హెచ్‌ఆర్‌ఎం విభాగం పరిశీలనకు పంపాలి. క్రమబద్ధీకరణ ద్వారా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల అమలులో అసమానతలు ఉత్పన్నమైతే వాటిని ఆయా కేటగిరీల్లో బ్యాక్‌లాగ్ పోస్టులుగా పరిగణించి భర్తీ చేయాలి. ఈ సమాచారాన్ని సంబంధిత శాఖ వెంటనే ఆర్థికశాఖలోని హెచ్‌ఆర్‌ఎం విభాగానికి తెలియపరచాలి. అయితే ఈ మార్గదర్శకాలను కేబినెట్ ఆమోదించినా... ఉత్తర్వుల జారీ, ప్రక్రియ అమలుకు మరికొంత సమయం పడుతుందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
బాబు చేసిన చట్టానికి సవరణ
రెండు దశాబ్దాల కిందట అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రభుత్వం... కాం ట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిషేధి స్తూ చట్టం చేసింది. తాజాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడ్డంకిగా మారడంతో.. ఈ ‘1994 యాక్ట్ నంబర్ 2’ను సవరించాలని కేబినెట్ తీర్మానించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై టీఆర్‌ఎస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా సీఎం కేసీఆర్ దీనిపై పలుమార్లు ప్రకటనలు చేశారు. తాజాగా దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో వివిధ శాఖల పరిధిలో పనిచేస్తున్న దాదాపు 18 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.