
మీడియా ముందు క్షమాపణలు చెబుతున్న మురళీమోహన్
క్షమాపణలు చెప్పిన మురళీమోహన్
న్యూఢిల్లీ: లోక్సభలో ఈరోజు సినీనటుడు, టిడిపి రాజమండ్రి ఎంపి మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంలేపాయి. ‘మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలు’ అన్న అంశంపై ఈరోజు సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేశారు. ఆ తరువాత తన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పారు. సభలో ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతిని నిలబెట్టేవిధంగా హుందాగా వస్త్రధారణ చేయాలన్నారు. సంస్కృతీ సంప్రదాయాల విషయంలో భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ప్రత్యేక స్థానం ఉందంటూ..వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై మహిళా ఎంపిలు మండిపడ్డారు. అతనిని బయటికి పంపాలని, అతని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంపీలు రంజీత్ రంజన్, సుష్మితా దేవ్,ప్రియా సులే తదితరులు తీవ్ర నిరసన తెలిపారు.
హైదరాబాద్లోని మహిళా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు కూడా మురళీమోహన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజిక కార్యకర్త దేవి మాట్లాడుతూ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. అటువంటి భావజాలం మార్చుకోవాలన్నారు. మరో సామాజిక కార్యకర్త లక్ష్మి మాట్లాడుతూ ఆడపిల్లని లైంగిక వస్తువుగా చూడకూడదని, అధికారంలో ఉన్నవారే ఆ అంశాలను ప్రచారం చేయాలని అన్నారు. ఆయన సినిమా రంగంలో ఉన్నవారైనందున, అటువంటి అవగాహన కల్పించేవిధంగా సినిమాలు తీయాలని కోరారు.
లోక్సభ నుంచి బయటకు వచ్చిన అనంతరం మురళీ మోహన్ మీడియాతో మాట్లాడుతూ లోక్సభలో తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు నొప్పించి ఉంటే మన్నించండని అడిగారు.