కన్వీనర్ ‘కోత’
ఆ కోటాకు ‘డీమ్డ్’ ముప్పు!
‘గీతం’ బాటలో మరికొన్ని వైద్య కళాశాలలు
కన్వీనర్ కోటాలో 850 సీట్లు కోల్పోనున్న వైనం
ఏపీలో ప్రైవేటు కళాశాలల వివరాలు
మొత్తం వైద్య కళాశాలలు 13
మైనారిటీ వైద్య కళాశాల 1
మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 1,700
కన్వీనర్ కోటాలో ఇస్తున్నది 850
సాక్షి, హైదరాబాద్ : ఏ ప్రభుత్వమైనా సామాన్యుడి సంక్షేమాన్ని కాంక్షించాలి. పేదలను దృష్టిలో పెట్టుకొనే సంక్షేమ పథకాల రచన సాగాలి. వారికి వెన్నుదన్నుగా నిలవాలి. అప్పుడే ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజల లక్ష్యాలు నెరవేరతాయి. తద్భిన్నంగా చంద్రబాబు సర్కారు నిర్ణయాలు ప్రైవేటు యాజమాన్యాలకు రాచబాట వేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా మారుతున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలను డీమ్డ్ కాలేజీలుగా మార్చేందుకు సర్కారు యోచిస్తోంది. ఈ నిర్ణయం ప్రతిభ కలిగిన, పేద విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది.
తాజాగా విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయానికి డీమ్డ్ హోదా కల్పించింది. దీనివల్ల ఆ కాలేజీలోని కన్వీనర్ కోటా సీట్లు అందని ద్రాక్షగా మిగలనున్నాయి. ప్రైవేటు వైద్య కళాశాలలు ‘డీమ్డ్’గా మారిపోనుండటంతో భవిష్యత్‌లో వైద్యవిద్యలో కన్వీనర్ కోటా సీట్లు దక్కకుండా పోయే పరిస్థితి దాపురించనుంది. దీనివల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు డీమ్డ్ హోదా కల్గిన వర్సిటీలు లేవు. గీతం బాటలోనే మరికొన్ని ప్రైవేటు కాలేజీలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఓ మంత్రికి చెందిన వైద్య కళాశాల డీమ్డ్ హోదాకు ముందు వరసలో ఉన్నట్టు తెలిసింది.
డీమ్డ్ యూనివర్సిటీలంటే?
కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కల్పించే వర్సిటీలను డీమ్డ్ విశ్వవిద్యాలయాలుగా పిలుస్తారు. యూజీసీ చట్టం (1956)లోని సెక్షన్-3 కింద కోర్సులు, సిలబస్, అడ్మిషన్ల విషయంలో స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. ప్రభుత్వ పెత్తనం ఉండదు. యాజమాన్యాలు భారీగా లబ్ధి పొందే ఆస్కారముంది.
డీమ్డ్ వల్ల నష్టాలివీ..
► రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలలు డీమ్డ్ కళాశాలలుగా మారిపోతే కన్వీనర్ కోటా కింద వచ్చే ఎంబీబీఎస్, పీజీ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉండదు.
► రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో 50 శాతం ఎంబీబీఎస్ సీట్లు కన్వీనర్ కోటా కింద ఇస్తున్నాయి. ఈ సీటు పొందిన విద్యార్థులు ఏడాదికి రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. డీమ్డ్ హోదా పొందిన కళాశాలలు కన్వీనర్ కోటా సీట్లు ఇవ్వవు.
► డీమ్డ్ కళాశాలలు ఎంసెట్ ప్రవేశ పరీక్ష పరిధిలోకి రావు. సొంతంగా నోటిఫికేషన్ ఇచ్చి సీట్లు భర్తీ చేసుకుంటాయి.
► రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించవు. దీంతో పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు.
► అన్ని కాలేజీలు డీమ్డ్‌కు వెళ్తే.. రాష్ట్రంలో సుమారు 850 ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లు కోల్పోవాల్సి వస్తుంది.
కన్వీనర్ కోటా సీట్లు అంటే...
రాష్ట్రంలో ఉన్న ఏ ప్రైవేటు వైద్య కళాశాల అయినా తనకున్న సీట్లలో 50 శాతం ప్రభుత్వానికి(ఇదే కన్వీనర్ కోటా) ఇవ్వాలి. మిగతా 50 శాతం సీట్లలో 35 శాతం సీట్లను యాజమాన్య కోటా కింద, 15శాతం సీట్లను ప్రవాస భారతీయ కోటా కింద(ఎన్‌ఆర్‌ఐ) కింద భర్తీ చేసుకుంటారు. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విధానం. కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ముందుగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న 1,600 సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుంది.
ప్రభుత్వ సీటు వద్దనుకుంటే నేరుగా కన్వీనర్ కోటా కింద ప్రైవేటు కాలేజీలోనూ తీసుకోవచ్చు. కన్వీనర్ కోటా సీటుకు ఫీజు ఏడాదికి రూ.10 వేలు మాత్రమే. ఐదేళ్ల ఎంబీబీఎస్ చదివితే ఫీజు రూ.50 వేలు మాత్రమే. ఇవే కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారితే ఒక్కో సీటుకు ఏడాదికి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు తక్కువ కాకుండా వసూలు చేస్తాయి.
ఆది నుంచీ ప్రైవేటుకు అనుకూలంగానే
చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ప్రైవేటుకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. గతంలో 50 శాతం కన్వీనర్, 10 శాతం ‘బి’కేటగిరీ సీట్లుండేవి. వాటిని కన్వీనర్ కోటా సీట్లు పొందిన తర్వాత ర్యాంకుల వారికి కేటాయించేవారు. ఈ సీట్లకు ఒక్కోదానికి రూ.2.40 లక్షలు ఫీజు ఉండేది. దీనికి ఫీజు రీయింబర్స్ వర్తించేది. చంద్రబాబు ప్రభుత్వం ‘బి’ కేటగిరీ సీట్లను ఎత్తేసింది. యాజమాన్యాలకే ఇచ్చేసింది. ఇక యాజమాన్యకోటా సీటుకు ఏడాదికి రూ.5.5 లక్షలు ఫీజు ఉండగా దీన్ని రూ.11 లక్షలు పెంచేశారు. కేబినెట్‌లో కీలకపాత్ర పోషిస్తున్న ఓ మంత్రి కళాశాల కోసమే ఇదంతా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
2018 నాటికి మెజారిటీ కాలేజీలు..
రాష్ట్రంలో ఉన్న మెజారిటీ కళాశాలలు 2018 నాటికి ‘డీమ్డ్’ యూనివర్సిటీలుగా మారనున్నాయి. దీనికోసం ఐదు కళాశాలలు కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
దుర్మార్గమైన చర్య
డీమ్డ్ హోదా అంటే ప్రైవేటు పరం చేయడంలో ఒక భాగమే. ఇది ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్య. భవిష్యత్‌లో డబ్బున్న వాళ్లే చదవగలరు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు వైద్య విద్య అభ్యసించడం అసంభవం. విద్యార్థి లోకం ఉద్యమిస్తేనే ఈ ప్రైవేటు చర్యలను నిలువరించగలం.
- డా.కె.హరిప్రసాద్, ముఖ్య సలహాదారు, జూనియర్ వైద్యుల సంఘం