దివాలా కోరల్లో కార్పొరేట్ భారత్! | corporate india faces recession | Sakshi
Sakshi News home page

దివాలా కోరల్లో కార్పొరేట్ భారత్!

Published Thu, Aug 15 2013 3:15 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

దివాలా కోరల్లో కార్పొరేట్ భారత్!

దివాలా కోరల్లో కార్పొరేట్ భారత్!

ముంబై: భారత కార్పొరేట్ కంపెనీల మెడపై దివాలా కత్తి వేలాడుతోంది. ఆర్థిక మందగమనానికి తోడు దేశీయంగా వినియోగ డిమాండ్ పడిపోవడం పారిశ్రామిక రంగాన్ని తూట్లు పొడుస్తోంది. భవిష్యత్తుపై భారీ ఆశలతో ఎడాపెడా అప్పులు చేసి విస్తరణకు పరుగులు తీసిన కంపెనీలు ఇప్పుడు చివురుటాకుల్లా వణుకుతున్నాయి. తీసుకున్న రుణాలు యమపాశాల్లా మారుతున్నాయి. ఇవేవో అల్లాటప్పా చిన్నకంపెనీలనుకుంటే పొరపాటే. దేశంలో టాప్ కంపెనీల్లో అనేకం ఇదే బాటలో నడుస్తున్నాయి.
 
 దేశంలోని అగ్రగామి కార్పొరేట్ సంస్థల్లో మూడోవంతు ఇప్పుడు ఆర్థికంగా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్‌ఈ) 500 టాప్ కంపెనీల ఇండెక్స్‌లో 143 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(మొత్తం షేర్ల విలువ) కంటే వాటి అప్పులే అధికం కావడం గమనార్హం. నాన్-బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థలు మినహా మొత్తం 406 కంపెనీల్లో మూడో వంతు కంపెనీలు(ఇప్పటిదాకా ఆర్థిక ఫలితాలను ప్రకటించినవాటిలో) తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రుణాలు గుదిబండగా మారడంతో వడ్డీలు అధికమై కంపెనీల లాభాలు ఆవిరవుతున్నాయి. డిమాండ్ పడిపోవడం కూడా లాభదాయకతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీంతో షేరు ధర పాతాళానికి జారిపోయి మార్కెట్ క్యాప్ కుదేలయ్యేలా చేస్తోంది. ఇవన్నీ ఆయా కంపెనీల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇప్పటికే రుణాలు తీసుకొని మొదలుపెట్టిన ప్రాజెక్టులు ముందుకు సాగడంలేదు.   షేరు ధర అట్టడుగుకు పడిపోవడంతో నిధులను సమీకరించే పరిస్థితులు లేవు. మరోపక్క, అధిక వడ్డీరేట్లు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో అప్పులు మొండిబకాయిలుగా మారడంతో బ్యాంకులు కూడా కార్పొరేట్లకు రుణాలపై వెనుకంజ వేస్తున్నాయి.
 
 ఇన్వెస్టర్లు దూరం...
ప్రాజెక్టు వ్యయాలు భారీగా పెరిగిపోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం, అధిక వడ్డీరేట్లు వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కంపెనీలు చేపట్టిన ప్రాజెక్టులు ఆర్థికంగా లాభదాయకం కాదని ఇన్వెస్టర్లు ఒక నిశ్చయానికి వస్తున్నారు. అప్పుల భారం, లాభదాయకంకాని ప్రాజెక్టుల నేపథ్యంలో ప్రస్తుత ప్రతికూల ఆర్థిక వాతావరణం కారణంగా అనేకమంది ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు అవసరమయ్యే కంపెనీల షేర్లకు దూరంగా ఉంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ 143 కంపెనీల నిర్వహణ లాభాలు బీఎస్‌ఈ-500(నాన్‌ఫైనాన్షియల్ సంస్థల్లో) జాబితాలోని మొత్తం కంపెనీలతో పోలిస్తే మూడో వంతు కూడా లేకపోవడం ఇన్వెస్టర్ల వెనుకంజకు కారణమనేది నిపుణుల విశ్లేషణ. ఇక మొత్తం కంపెనీల లాభాల్లో(క్యాష్) వీటి వాటా ఐదోవంతు మాత్రమే.

ఇదే తరుణంలో అప్పులు మాత్రం 71 శాతం, స్థిర ఆస్తులు సగానికిపైగా ఉండటం గమనార్హం. ఇక జూలైలో స్టాక్‌మార్కెట్ మొత్తం మార్కెట్ క్యాప్‌లో వీటి వాటా కేవలం 14 శాతమే కావడం విశేషం. కాగా, ఒక్కసారి వృద్ధి పుంజుకుంటే వీటికి నగదు ప్రవాహాలు పెరుగుతాయని, రుణాల చెల్లింపులకు మార్గం సుగమం అవుతుందని ఇండియా రేటింగ్స్ డెరైక్టర్ దీప్ నారాయణ్ ముఖర్జీ అంటున్నారు. ముఖ్యంగా అత్యధికంగా కార్పొరేట్ రుణాలతో ముడిపడిన ప్రాజెక్టులు మెటల్స్, మైనింగ్, విద్యుత్, చమురు-గ్యాస్ రంగాల్లోనే ఉన్నాయి. ఇక అప్పుల భారంతో బాగా సమస్యలు ఎదుర్కొంటున్న వాటిలో రియల్టీ, రిటైల్, విద్య, నిర్మాణ రంగాలు ముందువరుసలో ఉన్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు.
 
అప్పుల కుప్పలు...
క్యాపిటలైన్ తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి చివరినాటికి బీఎస్‌ఈ-500లోని ఈ 143 కంపెనీల మొత్తం అప్పులు రూ.13.2 లక్షల కోట్లుగా అంచనా. జూలై నాటికి వీటి సగటు మార్కెట్ క్యాప్‌తో పోలిస్తే రుణాలు దాదాపు రెండింతలయ్యాయి. రెండేళ్ల క్రితం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. 2011 జూలైలో ఈ కంపెనీల మార్కెట్ విలువ వాటి నికర రుణాల కంటే 40 శాతం అధికంగా ఉంది. రెండేళ్లు తిరిగేసరికి అంతా తలకిందులైంది. రుణాలు 61 శాతం ఎగబాకి.. మార్కెట్ క్యాప్ 40 శాతం పడిపోయింది. దీంతో ప్రాజెక్టులకు ఈక్విటీ ఆధారిత నిధుల సమీకరణకు తలుపులు మూసుకుపోయాయి.

అంతేకాదు రుణాల తిరిగి చెల్లింపుల విషయంలోనూ చేతులెత్తేసేలా సంక్షోభంలోకి కూరుకుపోయాయి. అప్పుల కుప్పలుగా తయారైన కంపెనీల జాబితాలో టాటా స్టీల్, హిందాల్కో, టాటా పవర్, ఎల్‌అండ్‌టీ, జేపీ అసోసియేట్స్, అదానీ పవర్, జీఎంఆర్ ఇన్‌ఫ్రా, జీవీకే పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, శ్రీరేణుకా సుగర్స్, బజాజ్ హిందుస్థాన్, సుజ్లాన్ వంటి అనేక దిగ్గజాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement