దేశానికి రెండు రాజ్యాంగాలు అనవసరం: తొగాడియా
అలహాబాద్: భారతదేశానికి రెండు రాజ్యాంగాలు అవసరం లేదని, రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తొలగించాల్సిందేనని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. 370 అధికరణను సమీక్షించాలని, కాశ్మీర్‌కు అవసరమైతే కొనసాగించాల్సిందేని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సూచనతో వీహెచ్‌పీ నేత విభేదించారు.
దేశానికి రెండు రాజ్యాంగాలు అవసరంలేదని పేర్కొన్నారు. ప్రత్యేక రాజ్యాంగం వల్ల భారత్‌లో మరో దేశంగా కాశ్మీర్ చలామణీ అవుతున్నదని తొగాడియా చెప్పారు. గుజరాత్‌లోఉన్న ఆయన సోమవారం ఫోన్‌లో విలేకరులతో మాట్లాడారు. కాశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తిని ఎట్టిపరిస్థితిలో ఆమోదించేది లేదన్నారు.
అంతేకాక దేశంలో ఉమ్మడిపౌరస్మృతి ఉండాల్సిందేనన్నారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ విషయాన్ని విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు.దేశంలో అనేక మతాల వారికి ఒకటే పౌరస్మృతి అమలవుతుండగా, ముస్లింలకు మాత్రం అమలు కావడం లేదని ఆయన అన్నారు. అందరికీ ఒకటే పౌరస్మృతి ఉండాలన్నారు.