టీఆర్‌ఎస్‌తో పొత్తు యోచన
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వెల్లడి
లోక్‌సభ ఎన్నికలకు 42 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీలతో పొత్తు పెట్టుకోవాలని యోచిస్తున్నట్లు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, టీఆర్‌ఎస్ ఏ పార్టీతో పొత్తుపెట్టుకుంటుందో తెలిసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని అజయ్‌భవన్‌లో సీపీఐ జాతీయ నాయకులు డి.రాజా, అతుల్ కుమార్‌సింగ్ అంజన్‌లతో కలిసి సురవరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు తమ పార్టీ అనుకూలమైనందున తెలంగాణలో సీపీఎంతో కలిసి వెళ్లే పరిస్థితి లేదన్నారు.
సీమాంధ్రలో ఏ పార్టీతో కలిసి వెళ్లాలో ఇంకా తేలనందున ఏపీలో అభ్యర్థులను ప్రకటించలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా సీపీఐ 60 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు సురవరం తెలిపారు. 17 రాష్ట్రాలలోని వివిధ లోక్‌సభ స్థానాలకు సీపీఐ తరఫున బరిలోకి దిగనున్న 42 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆయన ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై సురవరం విమర్శలు గుప్పించారు. అధికారంలోని కాంగ్రెస్ తప్పుడు విధానాల వల్ల ద్రవ్యోల్బణం, అవినీతి మితిమీరాయని, అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీదీ అదే ధోరణి అని ధ్వజమెత్తారు. ఆర్థిక, విదేశాంగ విధానాల్లో ఆ రెండు పార్టీలకూ తేడా లేదన్నారు. దేశంలో ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలని 11 పార్టీలతో ఫిబ్రవరి 25న ఢిల్లీలో చేసిన తీర్మానాన్ని సీపీఐ బలపరుస్తుందన్నారు.
సురవరం ఇంకా ఏమన్నారంటే...
తొలి జాబితాలో 10 మంది ఎస్టీలు, నలుగురు చొప్పున ఎస్సీలు, మైనార్టీలు, మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది. రెండో జాబితాలో మరికొంతమంది మైనార్టీలు, మహిళలకు అవకాశం కల్పిస్తాం.
అవకాశం ఉన్న చోట్ల సెక్యులర్ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తాం. సీపీఐ, సీపీఎంలు పరస్పరం పోటీచేసుకోకుండా వీలైనంతవరకూ ఒకరినొకరు బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తాం.
తెలంగాణలో సీపీఐ, సీపీఎంలు భిన్న వైఖరులు తీసుకున్నందున కలిసి ఉండేందుకు ఇబ్బందులున్నా.. సీమాంధ్రలో కలిసి పోటీచేసేందుకు మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదు.
{పస్తుత ఎన్నికలు ప్రాంతాల వారీగానే జరుగుతాయి. రాష్ట్రం ఏర్పడ్డాకే రెండు కమిటీలను ఏర్పాటు చేస్తాం.
మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీపెట్టేదే సమైక్యవాదంతో కాబట్టి ఆ పార్టీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదు.
సినీనటుడు పవన్‌కల్యాణ్ పార్టీ పెడతారో లేదో ఇంకా తెలియదు. ఆ పార్టీ విధానాలేంటో తెలియకుండానే దానిపై ఇప్పుడే చర్చించబోము.
సీపీఐ తొలి జాబితాలోని ప్రముఖులు వీరే..
ప్రబోధ్ పండా, సిట్టింగ్ ఎంపీ (మిడ్నాపూర్, పశ్చిమబెంగాల్), అతుల్ కుమార్ అంజన్ (ఘోషి, యూపీ), సంతోష్ రాణా, ఎమ్మెల్యే (ఘాతల్, పశ్చిమబెంగాల్), నురుల్ హుడా (బషిర్‌హత్, పశ్చిమబెంగాల్), కాగా సీనియర్ నేత గురుదాస్ దాస్‌గుప్తా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.