
ఆర్కేనగర్‌లో చిన్నమ్మ వర్గానికి చేదు అనుభవం
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో అన్నా డీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ వర్గానికి చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఆర్కే నగర్‌లో శశికళ వర్గానికి చెందిన సీఆర్ సరస్వతి ప్రచారం చేస్తుండగా.. ఓ వ్యక్తి ఆమెపైకి బూటు విసిరాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా శశికళ బంధువు టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. దినకరన్‌కు మద్దతుగా సరస్వతి ప్రచారం చేశారు.
ఈ నెల 12న జరిగే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 62 మంది బరిలో ఉన్నారు. డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా టీటీవీ దినకరన్, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ అభ్యర్థిగా మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థిగా జయలలిత మేన కోడలు దీప, సీపీఎం అభ్యర్థిగా లోకనాథన్, బీజేపీ అభ్యర్థిగా గంగై అమరన్, డీఎండిడీకే అభ్యర్థిగా మదివానన్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా కలైకోట్ ఉదయంలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు.