అవినీతిపై ప్రశ్నిస్తే నేరమా? | Crime of on the question of corruption? | Sakshi
Sakshi News home page

అవినీతిపై ప్రశ్నిస్తే నేరమా?

Published Wed, Aug 5 2015 2:11 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

అవినీతిపై ప్రశ్నిస్తే నేరమా? - Sakshi

అవినీతిపై ప్రశ్నిస్తే నేరమా?

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నిలదీత
 లోక్‌సభలో ఎంపీల సస్పెన్షన్ దారుణమని మండిపాటు
నిరసనగా కాంగ్రెస్ ధర్నా

 
హైదరాబాద్: అవినీతిని ప్రశ్నించడమే పాపం అన్నట్టుగా కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా మండిపడ్డారు. లోక్‌సభ నుంచి కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడానికి నిరసనగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ధర్నాలో వారు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి, నోటికి నల్లబట్టలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించారు. అనంతరం ఆ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్, కుంతియా మాట్లాడుతూ... ఆర్థికనేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకున్న లలిత్‌మోదీకి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మద్దతుగా ఉంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాజస్తాన్ సీఎం వసుంధర రాజేకు చెందిన కంపెనీలకు లలిత్‌మోదీ నుంచి నిధులు ఎలా వచ్చాయని నిలదీశారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంతో లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి, ప్రభుత్వమే వరుస హత్యలకు పాల్పడిందని ఆరోపించారు. వీటికి సమాధానం చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినమని ఉత్తమ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

గాంధీభవన్‌లోనూ....
ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను ఏపీసీసీ, టీపీసీసీ సంయుక్తంగా దహనం చేశాయి. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే హత్య చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు జరిగాయని ఉత్తమ్ చెప్పారు.  
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement