అక్షరాలు మార్చి దోచేస్తారు! | cyber crime in account takeover | Sakshi
Sakshi News home page

అక్షరాలు మార్చి దోచేస్తారు!

Published Sat, Jun 25 2016 5:02 PM | Last Updated on Wed, Apr 3 2019 8:09 PM

అక్షరాలు మార్చి దోచేస్తారు! - Sakshi

అక్షరాలు మార్చి దోచేస్తారు!

నగరంలోని వ్యాపార సంస్థల మెయిల్స్ హ్యాక్
ఇంటర్‌నెట్‌లో పొంచి ఉన్న ‘అకౌంట్ టేకోవర్లు’
ఆరు నెలల్లో 24 సంస్థలకు నేరగాళ్లు టోకరా
రూ.12 కోట్లు స్వాహా చేసిన క్రిమినల్స్

లాటరీలు, బహుమతుల పేరుతో టోకరా వేయడం మొన్నటి స్టైల్... ఉద్యోగాలు, సెల్‌టవర్ల ఏర్పాటు పేరుతో ఎర వేయడం నిన్నటి పంథా... ఇవేవీ కాకుండా హ్యాకింగ్,  స్ఫూఫింగ్ మెయిల్స్ ద్వారా ఏకంగా ఖాతాలనే మార్చేయడం నేటి శైలి.
 
హ్యాకింగ్ తర్వాత స్ఫూఫింగ్...
 ఇలా హ్యాక్ చేసిన ఈ-మెయిల్‌ను నిరంతరం అధ్యయనం చేడయం ద్వారా వారికి డబ్బు రావాల్సి, చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు స్ఫూఫింగ్‌కు దిగుతున్నారు. నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్, సదుపాయాన్ని అందించే వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌లో అనేకం ఉన్నాయి. వీటి సర్లర్వు విదేశాల్లో ఉండటం నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఈ సైట్‌లోకి ఎంటర్ అయ్యాక  సదరు వ్యక్తి ఈ-మెయిల్ ఐడీతో పాటు ఆ మెయిల్ అందుకోవాల్సిన వ్యక్తిది, రిసీవ్ చేసుకునేప్పుడు అతడి ఇన్‌బాక్స్‌లో ఏది కనిపించాలో అది కూడా పొందుపరుస్తారు. ఆ తర్వాత నగదు తీసుకోవాల్సిన వ్యక్తి పంపినట్లే ఇవ్వాల్సిన వారికి ఓ లేఖ మెయిల్ చేస్తారు.  అందులో అనివార్య కారణాల నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతా మారిందని, కొత్త అకౌంట్‌లో నగదు వేయాలని చెప్తూ నేరగాళ్లకు సంబంధించిన నెంబర్ ఇస్తున్నారు. దీంతో సదరు వ్యాపారికి చేరాల్సిన డబ్బు వీరి ఖాతాలోకి చేరుతోంది.
 
 అకౌంట్ టేకోవర్
 ఈ-మెయిల్స్ పెట్టుబడిగా ఆన్‌లైన్‌లో అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు ఇటీవల చేస్తున్న నేరం ‘అకౌంట్ టేకోవర్’. ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ-మెయిల్ ఖాతాలను హ్యాక్ చేయడం, చెల్లింపుల సమయంలో బ్యాంక్ ‘ఖాతా’ మార్చేసి తేలిగ్గా రూ.లక్షలు, రూ.కోట్లలో స్వాహా చేస్తున్నారు. గడిచిన ఆరు నెలల కాలంలో సైబరాబాద్ పరిధిలోని 24 కంపెనీలు ఈ నేరగాళ్ల బారినపడి రూ.12 కోట్లకు పైగా నష్టపోయాయి. బాధిత కంపెనీల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ ఠాణా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
 
 వ్యాపార సంస్థలే టార్గెట్‌గా బాట్‌నెట్ ఎటాక్స్
 అకౌంట్ టేకోవర్ ఫ్రాడ్‌కు నాంది ఆయా వ్యాపార సంస్థల ఈ-మెయిల్స్ హ్యాక్ చేయడంతో ద్వారా పడుతుంది. వ్యాపార సంస్థల వెబ్‌సైట్ ద్వారా సైబర్ నేరగాళ్లు  వాటి క్రయవిక్రయాల ఈ-మెయిల్స్‌ను గుర్తిస్తున్నారు. వీటికి వైరస్ ఎటాచ్‌మెంట్‌తో కూడిన ఈ-మెయిల్స్ పంపుతున్నారు. సాధారణంగా ఈ మెయిల్స్‌ను నిర్వహించేది అకౌంటెంట్స్ కావడంతో వారికి సైబర్ నేరాలపై అవగాహన ఉండట్లేదు. దీంతో వారు నేరుగా వీటిని ఓపెన్ చేయడంతో ఎటాచ్‌మెంట్ రూపంలో ఉండే వైరస్ ఆయా కంప్యూటర్లలో నిక్షిప్తం అవుతోంది. దీన్ని ‘బాట్‌నెట్ ఎటాక్’ అని పిలుస్తారు. దీంతో ఆ కంప్యూటర్‌లో ఉండే సమస్త సమాచారంతో పాటు ఈ-మెయిల్ సంప్రదింపుల్నీ నేరగాళ్లు వీక్షించే అవకాశం ఏర్పడుతోంది. అందులో ఉండే లావాదేవీలతో పాటు వారి భాషా శైలి, చెల్లింపులు/వసూళ్ల విధానం కొంతకాలం పాటు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా రెండు దేశాల మధ్య ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ వ్యాపారం చేసే వారే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు.
 
 పేర్లలో స్వల్ప మార్పు చేసి...
 ఆయా కంపెనీలను పోలిన పేర్లతో స్వల్ప అక్షరాల తేడాతో సైబర్ నేరగాళ్లు విదేశాల్లో సంస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు.  దీని ఆధారంగా డొమైన్లు ఖరీదు చేసి, ఆయా సంస్థల పేర్లతోనే ఈ-మెయిల్స్ సృష్టిస్తున్నారు. దీని ఆధారంగా నగదు పంపాల్సిన సంస్థకు ఈ-మెయిల్ పెడుతున్నారు. ఆదాయ పన్ను సమస్యనో, ఆడిటింగ్ కారణంగానే బ్యాంకు ఖాతా మారినట్లు అందులో పేర్కొంటున్నారు. విదేశాల్లో తెరిచిన ఖాతాల వివరాలు అందించి నగదు వాటిలో జమయ్యేలా చేస్తున్నారు. సైబరాబాద్ పరిధిలోని 24 కంపెనీలను టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు ఆ మొత్తాలను పోలెండ్, స్పెయిన్, ఫ్రాన్స్, లండన్‌లతో పాటు కజకిస్థాన్‌ల్లో తెరిచిన బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. దీని ఆధారంగానే పోలీసులు ఆయా దేశాల్లో సైబర్ నేరగాళ్ల ఏజెంట్లు ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రపంచంలోని కేవలం 36 దేశాలతోనే భారత్‌కు దర్యాప్తు సహకారం, నేరస్తుల మార్పిడి ఒప్పందాలున్నాయి. ఈ ఖాతాలన్నీ ఆ జాబితాలో లేని దేశాల్లో ఉండటంతో కనీసం ఖాతా తెరిచిన వారి వివరాలు తెలుసుకోవడం కష్టమవుతోంది.
 
 చిక్కకుండా  జాగ్రత్తలు...
 సౌతాఫ్రికా దేశాల కేంద్రంగా ఈ వ్యవహారాలు సాగిస్తున్న నైజీరియన్లు ఏ సందర్భంలోనూ ఇక్కడకు రాకుండా, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అకౌంట్ టేకోవర్ స్కామ్స్‌లో బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. వీటిని వారే నేరుగా తెరిస్తే పోలీసులకు చిక్కే అవకాశం ఉంది. దీంతో ఇక్కడివే, బోగస్ చిరునామాలతో తెరుస్తున్నారు.  దీనికోసం నైజీరియన్లు భారీ పథక రచన చేస్తున్నారు. ఆయా దేశాల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.  బ్యాంకు ఖాతాలను తెరిచి, తమ వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీలోనూ కమీషన్ ఇస్తామని ఈ ఏజెంట్లు అక్కడి నిరుద్యోగులకు గేలం వేస్తున్నారు.  కొందరు రాజకీయ ప్రముఖుల నల్లధనాన్ని తాము వైట్ మనీగా మారుస్తామని, దాని కోసమే ఖాతాలంటూ నమ్మబలికి వారిని ఒప్పిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఖాతాలు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు నైజీరియన్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో దొరకడం కష్టమవుతుంది.
 
 త్వరగా ఫిర్యాదు చేస్తే కొంత మేలు...
 ఆర్టీజీఎస్ ద్వారా దేశంలోని ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ కావాలంటే.. అది ఆర్బీఐ ద్వారా మాత్రమే జరుగుతుంది. ప్రతి బ్యాంక్‌కు ఆర్బీఐలో ఖాతాలు ఉంటాయి. వీటి ఆధారంగానే ఆర్టీజీఎస్ లావాదేవీలన్నీ సాగుతాయి. డిపాజిట్ చేసిన బ్యాంకు నుంచి నగదు ఆర్బీఐ ద్వారా అది చేరాల్సిన బ్యాంకు బ్రాంచ్‌కు చేరుతుంది. ఇందంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతుంది. ఇక విదేశాలల్లోని బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ కావాలంటే ఆర్బీఐ స్థానంలో ఇంటర్మీడియేటరీ బ్యాంకుల ద్వారా జరుగుతుంది. దీనికి కనీసం నాలుగైదు రోజులు పడుతుంది. ఈ సందర్భాల్లో ఎక్కడా అకౌంట్ హోల్డర్ పేరు, ఇతర వివరాల ప్రస్తావన ఉండదు. కేవలం బ్యాంకులు, వినియోగదారులకు కేటాయించిన ప్రత్యేక నెంబర్ల ద్వారానే జరిగిపోతుంది. అకౌంట్ టేకోవర్ ఫ్రాడ్ ద్వారా మోసపోయిన వారు ఎవరైనా తక్షణం గుర్తించి ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుంది. నగదు ఇంటర్మీడియేటరీ బ్యాంకు దాటిందంటే ఇక ఆశలు వదులుకోవాల్సిందే.
 
 సరిచూసుకోకుంటే నష్టపోవాల్సిందే...
 ఇటీవల ఈ తరహా నేరాలు పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు నగరానికి చెందిన 24 సంస్థలు రూ.12 కోట్లకు పైగా నష్టపోయాయి. ఈ తరహా నేరాల్లో నిందితులు చిక్కడం, నగదు రికవరీ కావడం కష్టసాధ్యం. దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్ ఖాతా మారిందంటూ మీకు కస్టమర్ పంపినట్లు మెయిల్ వస్తే అనుమానించి వారిని సంప్రదించండి. మీ ఖాతా మారితే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని మీరు లావాదేవీలు నెరిపే వారికి   స్పష్టంగా చెప్పండి. నిర్థారించుకోకుండా నగదు లావాదేవీలు చేయొద్దు. ఈ సంప్రదింపులకూ ఈ-మెయిల్‌ను ఆశ్రయించవద్దు. ఎందుకంటే అది అప్పటికే సైబర్‌నేరగాళ్ల చేతిలో ఉంటుంది. ఫోన్ కాల్, ఫ్యాక్స్‌ల ద్వారా ఈ నిర్ధారణ చేసుకోండి.
 - మహ్మద్ రియాజుద్దీన్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్, సైబరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement