సెప్టెంబర్ 1న వేతనంతోపాటు డీఏ
కరువు భత్యం ఫైలు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ
20న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం
18.340 శాతానికి చేరిన డీఏ
3.5 లక్షల మంది ఉద్యోగులు, 2.5 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి
జూలై డీఏపై కేంద్రం ప్రకటన వెలువడిన తర్వాత నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఎదురుచూపులు ఫలించనున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీన ఉద్యోగులకు ఇచ్చే వేతనంతోపాటు కరువు భత్యం(డీఏ) చెల్లించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైలును ఇప్పటికే ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. ఈ నెల 20న జరిగే కేబినెట్ సమావేశం దీనికి ఆమోదం తెలుపనుంది. 2016 జనవరి నెలలో ఇవ్వాల్సిన డీఏ కోసం రాష్ట్రంలోని 3.5 లక్షల మంది ఉద్యోగులు, కరువు భృతి(డీఆర్) కోసం 2.5 లక్షల మంది పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. డీఏ ఇవ్వాలని ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పటికే ప్రభుత్వానికి పలు దఫాలుగా విజ్ఞప్తి చేశారు. చివరకు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలసి విజ్ఞాపనపత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1న వేతనంతోపాటు డీఏ చెల్లించేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. కేబినెట్ ఆమోదం లభించగానే డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది.
18.340 శాతానికి చేరిన డీఏ
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 2016 జనవరి నాటికే మూల వేతనంపై 15.196 శాతం డీఏ అమల్లో ఉంది. దీనికి జనవరి నెలలో రావాల్సిన మరో 3.144 శాతం డీఏ కలిపి ఇవ్వాల్సి ఉంది. అంటే జనవరి నుంచి 18.340 శాతం డీఏ రావాల్సి ఉంది. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండుసార్లు(జనవరిలో ఒకసారి, జూలైలో మరోసారి) ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ఇస్తాయి. అయితే కేంద్రం ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత జనవరిలో ఇవ్వాల్సిన డీఏను కేంద్రం ఇప్పటికే మంజూరు చేసి ఇచ్చింది. మొన్నటి జూలైలో ఇవ్వాల్సిన డీఏను త్వరలోనే మంజూరు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మాత్రం జనవరిలో ఇవ్వాల్సిన డీఏ చెల్లింపునకు 20న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ఇక జూలైలో రావాల్సిన డీఏకు సంబంధించి కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.