
'అమ్మ' మరణ ధృవీకరణ పత్రం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) మృతితో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, కార్డియాక్ అరెస్ట్ తో ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. దీనికి అధికారిక మరణ ధృవీకరణ పత్రాన్ని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లోని పబ్లిక్ హెల్త్ విభాగం విడుదల చేసింది.
జయలలిత పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో మొదట ఆమె అధికార నివాసం పోయెస్ గార్డెన్‌కు అనంతరం రాజాజీ హాల్ కు తరలించారు. దీంతో తమ ప్రియతమ నాయకి, అమ్మ పురుచ్చత్తలైవిని కడసారి దర్శించుకునేందుకు లక్షలాది తమిళ ప్రజలు, అన్నాడీఎంకే కార్యకర్తలు తరలివస్తున్నారు. చెన్నై మెరీనా బీచ్ వద్ద గురువు ఎంజీఆర్ సమాధి పక్కనే ఈ రోజు( మంగళవారం) సాయంత్రం 5-6 గంటల మధ్య జయలలిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా దేశాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ జయలలిత మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. వీరితోపాటు పలువురు ఎంపీలు,కేంద్ర మంత్రులు,ఇ తర రాజకీయ ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ సంతాప దినాలను పాటిస్తున్నారు. అలాగే మంగళవారం ప్రారంభమైన పార్లమెంటు ఉభయ సభలు ముందుగా జయలలిత మృతికి సంతాపాన్ని ప్రకటించారు. అనంతరం సంతాపసూచకంగా రేపటికి వాయిదా పడ్డాయి.