ఉగ్రవాదమా.. మానవత్వమా? | decide what you need terrorism or humanity | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదమా.. మానవత్వమా?

Published Tue, Aug 18 2015 1:58 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ఉగ్రవాదమా.. మానవత్వమా? - Sakshi

ఉగ్రవాదమా.. మానవత్వమా?

 ⇒ ప్రపంచ దేశాలు  నిర్ణయించుకోవాలి: మోదీ
 ⇒ మంచి ఉగ్రవాదం - చెడ్డ ఉగ్రవాదం.. మంచి తాలిబాన్ - చెడ్డ తాలిబాన్ అనే తేడా ఉండదు.. హింసా మార్గం సరికాదు
 ⇒ ఎన్నాళ్లు పోరాటం చేసినా చివరకు చర్చల ద్వారానే పరిష్కారం
 ⇒ భారత్ పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటోంది
 ⇒ దుబాయ్ క్రికెట్ స్టేడియంలో 50 వేల మంది భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం


 దుబాయ్: ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో ఉంటారా? లేక వాటికి వ్యతిరేకంగా ఉంటారా? అన్నది దేశాలు నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు. పొరుగుదేశాలతో అన్ని సమస్యలనూ పరిష్కరించుకోవటానికి చర్చలు ఒక్కటే మార్గమని ఉద్ఘాటించారు. భారత్ తన పొరుగుదేశాలన్నిటితోనూ సత్సంబంధాలు కోరుకుంటోందని.. పాకిస్తాన్ పేరును ప్రస్తావించకుండానే అన్నారు.

యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఆదివారం నుంచి పర్యటిస్తున్న మోదీ రెండో రోజు సోమవారం పర్యటన చివర్లో దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారతీయ ప్రజా సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 50,000 మంది పాల్గొన్న ఈ సభ ‘మినీ భారత్’లా కనిపిస్తోందన్న మోదీ ఉత్తేజంగా మాట్లాడారు. సభికులు ‘మోదీ.. మోదీ..’ నినాదాలతో హర్షాతిరేకాలు వ్యక్తంచేయగా.. ఆయన ‘భారత్ మాతాకీ జై’ నినాదంతో ప్రసంగం ప్రారంభించారు. దాదాపు 70 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో.. ఉగ్రవాదం గురించి, యూఏఈ అందిస్తున్న సహకారం గురించి, పొరుగుదేశాలతో భారత్ సంబంధాల గురించి, దేశంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. యూఏఈలో లీగల్ కేసుల విషయంలో భారతీయులకు సాయం చేసేందుకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అబుదాబిలో ఆలయం నిర్మాణానికి స్థలం కేటాయించిన యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌కు సభికులు నిలుచుని కరతాళ ధ్వనులు చేయటం ద్వారా తమ సంతోషం తెలిపారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
 మీరు భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారు...
 ‘‘నా దేశ ప్రజలకు.. భారత్ నలుమూలల నుంచీ వచ్చిన వారికి అభినందనలు. కష్టపడి పనిచేస్తున్న వారు మీరు. చాలా ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. అదే సమయంలో మీరు భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారు. ఈ దేశంలో మీ ప్రవర్తన పట్ల మేం ఎల్లవేళలా గర్విస్తున్నాం. భారత్‌లో వర్షం పడినా కూడా.. దుబాయ్‌లోని ప్రజలు మమ్మల్ని భద్రంగా ఉంచేందుకు గొడుగులు విప్పుతారు. వాజపేయి భారత ప్రధానిగా ఉన్నపుడు భారత్ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించింది. ప్రపంచం నిర్ఘాంతపోయింది. భారత్‌పై ఆంక్షలు పెట్టారు. అప్పుడు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు భారత్‌కు సాయం చేయాలని వాజపేయి కోరారు. భారత ఖజానాను నింపిన అతి పెద్ద సాయం ఈ గల్ఫ్ దేశంలో పనిచేస్తున్న భారతీయులదే. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా మీకందరికీ అభినందనలు.

 34 ఏళ్లు పట్టింది... ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలూ దుబాయ్‌లో నివసిస్తున్నారు. ప్రపంచంలోని అతి శీతల ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా దుబాయ్‌లోని 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఇష్టపడతారు. ప్రపంచాన్ని దుబాయ్‌కి రప్పించిన ఆ శక్తిని, ఆకర్షణ శక్తిని ఊహించుకోండి. కేరళ ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. నా ఎదుట నేను ఒక చిన్న భారత్‌ను చూస్తున్నా. నేను ఇక్కడికి ఎన్నడూ రాలేదు. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఇక్కడికి రావటాన్ని ఊహించండి.

భారత్‌కు- యూఏఈకి మధ్య ఎన్నో విమానాలు ఉన్నాయి. కానీ.. ఒక భారత ప్రధాని ఈ దేశాన్ని సందర్శించటానికి 34  ఏళ్లు పట్టింది. మీరు బాధపడి ఉండొచ్చు. ఇక్కడి ఉన్నత స్థాయి నాయకులు బాధపడి ఉండొచ్చు. కానీ.. మీరు నాపై ప్రేమ కురిపించారు. యువరాజు, ఆయన ఐదుగురు సోదరులు విమానాశ్రయం వద్ద నాకు ఆహ్వానం పలికారు. వారికి ఎతో కృతజ్ఞుడ్ని. ఈ ప్రేమ, ఈ గౌరవం ఒక వ్యక్తికి కాదు. ఇది.. మారుతున్న భారత దృక్కోణానికి గౌరవం. భారత్ నెమ్మదిగా ప్రపంచంలో తన సొంత గుర్తింపును రూపొందించుకుంటోంది.
 రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడులకు యువరాజు హామీ
 ముప్పై ఏళ్ల తర్వాత 125 కోట్ల మంది భారతీయులు ఒక మెజారిటీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఒక వ్యక్తి మోదీతో కరచాలనం చేసినపుడు.. ఆ వ్యక్తి 125 కోట్ల మంది భారతీయులను చూస్తాడు. కొంత కాలం కిందట మేం ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రారంభించాం. ‘స్వాగతం.. ఇండియా అవకాశాల దేశం’ అని అంటున్నాం. నేడు ఐఎంఎఫ్ కానీ, మూడీ కానీ, మరేదైనా ఆర్థిక రేటింగ్ సంస్థ కానీ.. భారత్‌లో అత్యంత వేగవంత ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి జరుగుతోందని ఏకగ్రీవంగా చెప్తున్నాయి. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 48 శాతానికి పెంచటం జరిగింది. భారత్‌లో రూ. 4.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని యువరాజు హామీ ఇచ్చారు. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చినందుకు ఈ దేశ అగ్ర నేతలకు నేను కృతజ్ఞుడ్ని.

 ఆ ప్రకటనను అర్థం చేసుకునే వాళ్లు అర్థం చేసుకుంటారు...
 ఉగ్రవాద క్రీడలు ఆడుతున్నారు. అమాయకులు చనిపోతున్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం సృష్టించాలని వారు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక ఆలయాన్ని నిర్మించటం కోసం మనకు భూమి ఇవ్వటానికి ఘనతవహించిన యువరాజు అంగీకరించారు. ఈ నిర్ణయం ప్రాధాన్యత, విశిష్టతను ఇక్కడ ఉండే జనం అర్థంచేసుకుంటారు. యూఏఈ, భారత్‌లు ఈ రోజు తమ సంయుక్త్త ప్రకటనలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పష్టమైన ప్రకటన చేశాయి. ఇది ముఖ్యమైనది. అర్థం చేసుకునే వాళ్లు అర్థంచేసుకుంటారు. భారత వైఖరికి ఘనత వహించిన యువరాజు మద్దతు ఇచ్చారని మీకు సంతోషంగా చెప్తున్నాను.
 ఎన్నాళ్లు పోరాడినా చివరికి చర్చలే పరిష్కారం...
 నాగాలాండ్ తీవ్రవాదం ప్రభావం కింద నలిగిపోతూ ఉంది. ఇప్పుడు నేను సంతృప్తిగా మీతో చెప్పగలను. నెల రోజుల కిందట.. ఈ తీవ్రవాద బృందాలతో మేం చర్చలు జరపగలిగాం. 60-70 ఏళ్ల తర్వాత వారిని ప్రధానస్రవంతిలోకి తీసుకురాగలిగాం. భారత్ పొరుగుదేశాలకు నేను ఒక మాట చెప్తూ ఉన్నా. చివరికి.. పరిష్కారం చర్చల ద్వారానే దొరుకుతుంది. ఎంత కాలం పోరాడారనే దానితో సంబంధం లేదు.. తుది నిర్ణయం చర్చల తర్వాతే, టేబుల్‌పైనే తీసుకోవటం జరుగుతుంది. హింసా మార్గం సరైన దారి కాదని, చరిత్ర పుస్తకాల్లో కేవలం విధ్వంసాన్ని మాత్రమే చేర్చుతుందని  వారికి చెప్పదలచుకున్నాను. అందుకే.. పరిస్థితిని బట్టి వారు హింసను వదిలి ప్రధాన స్రవంతిలో కలవాలి. బంగ్లాదేశ్, భారత్‌లకు సరిహద్దు నిర్ణయం కష్టమైంది.

చొరబాట్లు సులభంగా ఉండేవి. మీ ఆశీస్సులతో.. భారత్ చర్చల ద్వారా పరిష్కారం కనుగొనటానికి చొరవ చూపింది. గత సెప్టెంబర్‌లో నేను బంగ్లాదేశ్ అధ్యక్షురాలిని కలిశాను. ఈ వివాదాన్ని ముగిస్తూ మేం ఒప్పందంపై సంతకాలు చేశాం. నేడు ప్రతి చోటా కనిపించే ప్రభుత్వం ఢిల్లీలో ఉంది. నేపాల్ ప్రజలకు అవసరమైన సమయంలో వారికి సాయం చేయటానికి భారతీయులు కొన్ని గంటల్లోనే వెళ్లారు. నేపాల్ మన పొరుగు దేశం. వారు బాధలో ఉంటే.. మనం సంతోషంగా ఉండలేం. భారత ప్రధానమంత్రి నేపాల్‌ను సందర్శించటానికి 17 సంవత్సరాలు పట్టింది. రెండు దేశాల మధ్య సంబంధాలను మళ్లీ వెలిగించాను. శ్రీలంకలోని జాఫ్నాకు వెళ్లి వారి సమస్యలను వినటానికి, వారి కన్నీళ్లు తుడవటానికి నేను అక్కడికి వెళ్లాను. తాగటానికి నీరు లేని దేశం గురించి ఊహించండి. మాల్దీవులు తమకు ఒక సమస్య ఉందని మనకు సందేశం పంపించారు. మేం ఒక్క క్షణం కూడా ఆగలేదు. విమానాల్లో, స్టీమర్లలో తాగు నీటిని పంపించాం.

అక్కచెల్లెళ్లకు ‘జీవన్ సురక్ష’
 భారతీయులకు బ్యాంకు ఖాతాల్లేవు.  ప్రతి ఒక్కరికీ ఈ ఖాతాలు తెరిచాం. మా వాళ్లకు బీమా లేదు. మూడు కొత్త పథకాలు తెచ్చాం. ఒక పథకానికి నెలకు ఒక్క రూపాయి చాలు.  ఇది ఆ వ్యక్తికి రూ. 2 లక్షల బీమా సదుపాయం కల్పిస్తుంది. రాఖీ సందర్భంగా భారత్‌లోని మీ అక్కచెల్లెళ్లకు జీవన్ సురక్షా యోజన ఇవ్వాలని గల్ఫ్ దేశాల్లోని నా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వారి ఖాతాల్లో కేవలం రూ. 600 డిపాజిట్ చేయండి.


 
 సార్క్‌కు కొత్త జీవితం  ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాం...

 సార్క్‌కు కొత్త జీవితం ఇవ్వటానికి మేం ప్రయత్నిస్తున్నాం. అంతకుముందు అది ఒక దానితో మరొకటి పోట్లాడుకునే వేదికగా ఉండేది. నేడు సార్క్ దేశాలను కొత్త అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లాలని మేం కలగంటున్నాం. ఒక సార్క్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలని మేం నిర్ణయించాం. దాని సేవలను సార్క్ దేశాలకు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అభివృద్ధి కొత్త శిఖరాలను దాటివెళ్లాలని భారత్ కోరుకుంటోంది. పెద్ద దేశమన్న అహంకారంతో కాదు మేం పని చేయం.. ప్రతి ఒక్కరితో చేయి కలిపి అభివృద్ధి దిశగా పనిచేస్తాం.

 సమస్యలుంటే ‘మదద్’ను వినియోగించుకోండి...
 దౌత్యకార్యాలయానికి సంబంధించి మీకు సమస్యలు ఉంటే.. ప్రభుత్వం మదద్ అనే వేదికను ప్రారంభించింది. విదేశాల్లోని భారతీయులు దీనిని వినియోగించుకోవచ్చు. ఇ-మైగ్రేట్ పోర్టల్‌ను కూడా వినియోగించుకోవచ్చు. ఇక్కడి భారత సమాజాలు ఎక్కువగా కార్మికులు. వృథా చేయటానికి అదనపు డబ్బు వారివద్ద లేదు. నెలకు ఒకటి లేదా రెండు సార్లు కౌన్సిలర్ శిబిరాలు ఏర్పాటు చేయాలని మేం అడిగాం. ప్రజలు ఇక్కడికి కార్మికులుగా వచ్చారు. అమెరికాలోని వారికి నేను ఏదైనా చేయవచ్చు, చేయకపోవచ్చు.. కానీ మీకు ఏదైనా చేయలేకపోతే నేను అశాంతికి గురవుతాను. భారతీయుల కోసం.. మేం పాస్‌పోర్టుల రంగు చూడం.. వారి రక్తపు రంగు చాలు.’’
 మతం రంగు పులమొద్దు
 దేశాలు ప్రోత్సిహ స్తున్న ఉగ్రవాదం సహా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని.. ఎక్కడైనా, ఎవరు పాల్పడినా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారత్, యూఏఈ పేర్కొన్నాయి. అన్ని దేశాలూ ఇతర దేశాలపై ఉగ్రవాదాన్ని ప్రయోగించటాన్ని విడనాడాలని కోరాయి. పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ.. ఉగ్రవాద సదుపాయాలను ధ్వంసం చేయాలని, ఉగ్రవాదానికి పాల్పడేవారిని బోనెక్కించాలని పిలుపునిచ్చాయి. మోదీ  సోమవారం అబుదాబిలో ఆ దేశ యువరాజు, సాయుధ దళాల ఉపసర్వాధిపతి మొహమ్మద్ బిన్ నహ్యాన్‌తో; దుబాయ్‌లో యూఏఈ ఉప రాష్ట్రపతి, ప్రధాని  రషీద్ అల్ మక్తూమ్‌తో చర్చలు జరిపారు. తర్వాత 31 సూత్రాలతో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇతర దేశాలపై ఉగ్రవాదాన్ని ప్రయోగించడాన్ని ఇరుదేశాలుఖండించాయి. వివాదాలకు మతం రంగు పులమొద్దన్నాయి. ఉగ్రవాద  వ్యతిరేక చర్యల్లో, ఆర్థిక రంగంలో సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించాయి. రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. భారత్‌లో రక్షణ పరికరాల తయారీని  ప్రోత్సహించాలని అంగీకారానికి వచ్చాయి. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థిత్వానికి యూఏఈ మద్దతు ప్రకటించింది.
 
 దేశాలు ప్రోత్సిహ స్తున్న ఉగ్రవాదం సహా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని.. ఎక్కడైనా, ఎవరు పాల్పడినా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారత్, యూఏఈ పేర్కొన్నాయి. అన్ని దేశాలూ ఇతర దేశాలపై ఉగ్రవాదాన్ని ప్రయోగించటాన్ని విడనాడాలని కోరాయి. పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ.. ఉగ్రవాద సదుపాయాలను ధ్వంసం చేయాలని, ఉగ్రవాదానికి పాల్పడేవారిని బోనెక్కించాలని పిలుపునిచ్చాయి. మోదీ  సోమవారం అబుదాబిలో ఆ దేశ యువరాజు, సాయుధ దళాల ఉపసర్వాధిపతి మొహమ్మద్ బిన్ నహ్యాన్‌తో; దుబాయ్‌లో యూఏఈ ఉప రాష్ట్రపతి, ప్రధాని  రషీద్ అల్ మక్తూమ్‌తో చర్చలు జరిపారు. తర్వాత 31 సూత్రాలతో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇతర దేశాలపై ఉగ్రవాదాన్ని ప్రయోగించడాన్ని ఇరుదేశాలుఖండించాయి. వివాదాలకు మతం రంగు పులమొద్దన్నాయి. ఉగ్రవాద  వ్యతిరేక చర్యల్లో, ఆర్థిక రంగంలో సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించాయి. రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. భారత్‌లో రక్షణ పరికరాల తయారీని  ప్రోత్సహించాలని అంగీకారానికి వచ్చాయి. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థిత్వానికి యూఏఈ మద్దతు ప్రకటించింది.
 ఆ పదాన్ని ద్వేషిస్తున్నారు
 
 ఈ రోజు ప్రపంచం ఉగ్రవాదం పేరు వినగానే వణికిపోతోంది. వారు ఈ పదాన్ని ద్వేషిస్తున్నారు. ఉగ్రవాదుల తూటాల వల్ల మన అమాయక ప్రజలు హత్యకుగురవుతున్నారు. ఇతర నాయకులతో నేను ఉగ్రవాద సమస్య గురించి మాట్లాడినప్పుడు.. అది మీ శాంతిభద్రతల సమస్య అని వాళ్లు చెప్పేవాళ్లు. ఉగ్రవాదానికి ఏ సరిహద్దులూ లేవని ఇప్పుడు వాళ్లు బాగా అర్థం చేసుకున్నారు. మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం.. మంచి తాలిబాన్, చెడ్డ తాలిబాన్ అనేది ఇక ఏమాత్రం పనిచేయబోదు. ప్రతి ఒక్కరూ తాము ఉగ్రవాదంతో ఉన్నామా లేక మానవత్వంతో ఉన్నామా అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాదాన్ని నిర్వచించటంలో.. ఏ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి అనే దాంట్లో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి విఫలమైంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర తీర్మానం సుదీర్ఘ కాలంగా ఐరాసలో నిలిచిపోయి ఉంది. ఈ విషయంలో భారత వైఖరికి యూఏఈ మద్దతిచ్చింది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement