అత్త నియోజకవర్గంలో దీప బోటు తేలుతుందా?
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌లో ఆమె మృతితో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. జయలలిత రాజకీయ వారసత్వం తమదేనంటూ వాదిస్తున్న పలు పార్టీలు, పలువురు నేతలు కూడా ఆర్కే నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జయలలిత వారసత్వం తనదేనంటూ ఒకవైపు ఆమె నెచ్చెలి శశికళ, నమ్మినబంటు పన్నీర్ సెల్వం పోట్లాడుతుండగా.. మరోవైపు అసలైన వారసురాలిని తానేనంటూ జయ మేనకోడలు దీపాజయకుమార్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో స్వయంగా బరిలోకి దిగిన దీపాజయకుమార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా 'బోటు' గుర్తును కేటాయించింది.
జయలలిత నాయకత్వం వహించిన అన్నాడీఎంకే పార్టీ ఎవరికీ చెందాలనే దానిపై ఇటు శశికళ వర్గం, అటు పన్నీర్ వర్గం ఎన్నికల సంఘం గడపను తొక్కడంతో ఇప్పటికిప్పుడే ఎవరిదో తేల్చడం కష్టమంటూ.. ఆ ఇద్దరికీ కొత్త గుర్తులను ఈసీ కేటాయించిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే రెండాకుల గుర్తును స్తంభింపజేసిన ఈసీ.. శశికళ వర్గానికి 'టోపీ' గుర్తును, పన్నీర్ వర్గానికి 'రెండు విద్యుత్ దీపాల' గుర్తును కేటాయించింది. తాజాగా ఆర్కే నగర్‌లో అదృష్టం పరీక్షించుకుంటున్న దీపాజయకుమార్‌కు 'బోటు' (పడవ) గుర్తును ఖరారుచేసింది. దీంతో అత్త స్థానంలో సత్తా చాటి రాజకీయంగా ఎదగాలనుకుంటున్న దీపాజయకుమార్ పడవ మునుగుందా? తేలుతుందా? అన్నది త్వరలో తేలనుంది.