గీతికా శర్మ ఆత్మహత్య; మాజీ మంత్రికి బెయిల్
ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాకు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శాసనసభ సమావేశాలను హాజరయ్యేందుకు వీలుగా ఆయనకు అక్టోబర్ 4 వరకు బెయిలిచ్చింది. 14 నెలలుగా కస్టడీలో ఉన్న కందాకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో తాత్కాలికంగా విముక్తి లభించనుంది.
ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తూ గీతికా శర్మ(23) గత ఏడాది ఆగస్టు 5న వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ రెసిడెన్సీలో ఆత్మహత్యకు పాల్పడింది. గోపాల్ కందా తనను తీవ్రంగా వేధింపులకు గురిచేయడంతో బలవన్మరణానికి పాల్పడినట్టు సూసైడ్ నోట్లో గీతిక పేర్కొంది. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విచారణ ప్రారంభమయిన దగ్గర్నుంచి కందా నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో గీతిక తల్లి కూడా తర్వాత ఆత్మహత్య చేసుకుంది. దీంతో కందా మెడకు మరింత ఉచ్చు బిగిసింది.