
అజ్ఞాతంలోకి సోమ్‌నాథ్‌భారతీ
ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతీకి ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిలును మంగళవారం నిరాకరించింది.
ముందస్తు బెయిలు నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతీకి ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిలును మంగళవారం నిరాకరించింది. సోమ్‌నాథ్ భార్య లిపికా మిత్రా నమోదు చేసిన గృహహింస కేసులో పూర్తి ధృవప్రతాల రుజువులతో ఆరోపణలు చేశారని న్యాయమూర్తి జస్టిస్ సురేశ్‌కైత్ వ్యాఖ్యానించారు. ఇంతకాలంగా ఆమె తన భర్త వేధింపులను భరిస్తూ వచ్చారని ఆయన అన్నారు.
లిపికా గర్భవతిగా ఉన్నప్పుడు కుక్కను ఉసిగొల్పి అమానుషంగా ప్రవర్తించినట్లు మెడికల్ రిపోర్టు స్పష్టం చేస్తోందన్నారు. హైకోర్టు సోమ్‌నాథ్ భారతీ ముందస్తు బెయిలు పిటిషన్ తోసిపుచ్చిన వెంటనే ఢిల్లీపోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకురంగంలోకి దిగారు. అయితే తాను అరెస్టు కాకుండా సోమ్‌నాథ్ భారతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంటిదగ్గర కానీ, పార్టీ ఆఫీసులో కానీ ఆయన లేకపోవటంతో భారతీ సోదరుడు, వ్యక్తిగత కార్యదర్శిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు తెచ్చుకోవాలని భారతీ ప్రయత్నిస్తున్నారు.