రాహుల్ గాంధీ.. (యేనా)?
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీయేనా? ఒకవేళ నిజమే అయితే అతను ఎలా ఉంటాడు? తల వెంట్రుకలు ఏ రంగులో ఉంటాయి? కనుగుడ్లు నల్లగా ఉంటాయా లేక బ్రౌన్ కలర్లో ఉంటాయా?.. వెర్రితనానికి పరాకాష్టలా ఏమిటీ వింత ప్రశ్నలు అంటారేమో! మరి ఈ ప్రశ్నలన్నింటికీ సావధానంగా సమాధానాలిచ్చిన రాహుల్ గాంధీ ఏమనుకొని ఉంటారో ఊహించగలమా! ఇంతకీ ఈ ప్రశ్నావళిని రూపొందించింది ఎవరోకాదు.. ఘనత వహించిన ఢిల్లీ పోలీసులు!
వ్యక్తిగత కారణాలతో పార్లమెంటుకు సెలవుపెట్టి మరీ విశ్రాంతి తీసుకుంటున్న రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసు ప్రత్యేక బృందం కొద్దిరోజుల క్రితం ఆయన కార్యాలయంలో కలిసింది. అప్పటికే సిద్ధం చేసుకున్న ప్రశ్నల జాబితాను రాహుల్ ముందుంచింది. ప్రశ్నలు విని ఒక్కసారిగా అవాక్కయిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. కాసేపటికి తేరుకొని వాటన్నింటికి ఓపికగా సమాధానమిచ్చారట.
గతవారం జరిగిన ఈ ఘటనపై స్పందించేందుకు ఢిల్లీ పోలీసు అధికారులు నిరాకరించారు. అసలిలాంటి దర్యాప్తు అవసరం ఏంటన్న మీడియా ప్రశ్నలకు మాత్రం పోలీసులు మౌనాన్నే సమాధానంగా పేర్కొన్నారు. అయితే ఈ ఉదంతంపై కాంగ్రెస్ వర్గాలు మాత్రం అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. పోలీసులు నిర్వహించిన దర్యాప్తును మతిలేని చర్యగా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకుడొకరు ఈ వ్యవహారం వెనక అధికార పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. 'మా నాయకుడు రాహుల్ గాంధీ ఓ ఎంపీ అన్న సంగతి ఢిల్లీ పోలీసులకు తెలియదా? రాహుల్ గురించి ఇంటర్నెట్లో కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. అదీ సరిపోదనుకుంటే పార్లమెంటు అధికారుల్ని సంప్రదించాలి కానీ ఇలా కార్యాలయానికి వచ్చి అర్ధంలేని విధంగా ప్రశ్నించడం ఎంతవరకు సబబు?' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు మరో కాంగ్రెస్ నేత.
కొసమెరుపు ఏమంటే.. ప్రశ్నల పరంపర పూర్తయిన తర్వాత దర్యాప్తు బృందంలోని పోలీసులందరూ రాహుల్ గాంధీతో ఫొటోలు దిగడంతోపాటు, ఆటోగ్రాఫ్ లూ తీసుకున్నారట! రాహుల్ గాంధీను ప్రశ్నించడాన్ని నిరసిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.