
నారాయణరెడ్డి ఆ సంగతి నాకు చెప్పలేదు: కేఈ
- వైఎస్సార్‌సీపీ నేత హత్యపై డిప్యూటీ సీఎం స్పందన
విజయవాడ: రాష్ట్రంలో సంచలన సృష్టించిన చెరకులపాడు నారాయణరెడ్డి హత్యపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎట్టకేలకు స్పందించారు. హత్యకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. విపక్ష నేతలు వరుసగా హత్యలకు గురవుతున్నా తెలుగుదేశం పాలనలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని కేఈ పేర్కొన్నారు.
‘తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని నారాయణరెడ్డి ఏనాడూ నాతో చెప్పలేదు. కేవలం పోలీసులకు మాత్రమే చెప్పుకున్నాడు. అతని గన్ లైసెన్స్ రెన్యూవల్ విషయం పోలీసులకే తెలుసు. నా కుమారుడి ఇసుకదందాపై పోరాడినందుకే నారాయణరెడ్డిని అంతం చేశారని అనడం కరెక్ట్‌కాదు. ఈ హత్యకూ మాకు ఎలాంటి సంబంధం లేదు. నారాయణరెడ్డి గన్ లైసెన్స్ ఎందుకు రెన్యూవల్ చేయలేదో పోలీసులనే అడగాలి..’ అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు.
జరిగిన సంఘటన దురదృష్టకరమని, నారాయణరెడ్డిని చంపింది ఎవరో పోలీసుల విచారణలో తేలుతుందని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని కేఈ అన్నారు. ఇకపై కర్నూలు జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చూస్తానని చెప్పారు.
హైకోర్టు మా పేర్లు చెప్పిందా?
కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు నేతృత్వంలో సాగుతోన్న ఇసుక మాఫియాపై నారాయణరెడ్డి కోర్టును ఆశ్రయించడం, దందాలపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించడం తదితర అంశాల నేపథ్యంలో కేఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘హైకోర్టు ఆదేశాల్లో నా పేరుగానీ, నా కొడుకు పేరుగానీ ఉందా? నా వారసుడు కాబట్టే అభాండాలు వేస్తున్నారు. ఇసుక దందాపై కలెక్టర్, ఉన్నతాధికారులతో బహిరంగ చర్చ పెట్టాం. కానీ అప్పుడు ఎవరూ ముందుకురాలేదు’అని కేఈ పేర్కొన్నారు.