deputy cm KE krishnamurthy
-
కర్నూలు టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, కర్నూలు : జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దుండగులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తుగ్గలి నాగేంద్రకు సంబంధించిన ఆస్తుల మీద దాడి చేశారు. నాగేంద్ర రైల్వే పనులకు ఉపయోగిస్తున్న రెండు టిప్పర్లు, నాలుగు హిటాచీ వాహనాలను ధ్వంసం చేయడమే కాక పని వారి మీద కూడా దాడి చేశారు. డిప్యూటి సీఎం కొడుకు అనుచరులే తన మీద దాడి చేశారని ఆరోపిస్తున్నారు నాగేంద్ర. దాడి చేయడానికి వచ్చిన మనుషులు సీఎం కొడుకు శ్యాంబాబు వాహనంలోనే వచ్చారని తెలిపారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ఇలాంటి దాడులకు పాల్పడ్డారని నాగేంద్ర ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆ హత్యతో నాకు సంబంధం లేదు
-
ఆ హత్యతో నాకు సంబంధం లేదు: కేఈ
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణరెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. తనకుగానీ, ముఖ్యమంత్రికిగానీ హత్యలు చేయించాల్సిన అవసరం లేదన్నారు. తాను హత్యా రాజకీయాలు ప్రోత్సహించనని తెలిపారు. ఆయన సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నారాయణరెడ్డి హత్యలో తన పాత్ర ఉందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించడం తగదన్నారు. తాను ఆ నియోజకవర్గం నుంచి గెలిచి ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను కాబట్టే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఆయన్ను ఎవరు హత్య చేశారో పోలీసు విచారణలో తేలుతుందన్నారు. తాను పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. ఈ హత్యలో తనతోపాటు తన కుమారుడు శ్యాంబాబుకూ సంబంధం లేదన్నారు. తానెప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని, తనపై కావాలనే ప్రతిపక్ష నేత బురద జల్లుతున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించి తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. తన రాజకీయ వారసుడు శ్యాంబాబని గతంలోనే చెప్పానని, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయన్ను పత్తికొండ నియోజకవర్గం టీడీపీ కో–ఆర్డినేటర్‌గా నియమించారని తెలిపారు. -
నారాయణరెడ్డి ఆ సంగతి నాకు చెప్పలేదు: కేఈ
- వైఎస్సార్సీపీ నేత హత్యపై డిప్యూటీ సీఎం స్పందన విజయవాడ: రాష్ట్రంలో సంచలన సృష్టించిన చెరకులపాడు నారాయణరెడ్డి హత్యపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎట్టకేలకు స్పందించారు. హత్యకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. విపక్ష నేతలు వరుసగా హత్యలకు గురవుతున్నా తెలుగుదేశం పాలనలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని కేఈ పేర్కొన్నారు. ‘తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని నారాయణరెడ్డి ఏనాడూ నాతో చెప్పలేదు. కేవలం పోలీసులకు మాత్రమే చెప్పుకున్నాడు. అతని గన్ లైసెన్స్ రెన్యూవల్ విషయం పోలీసులకే తెలుసు. నా కుమారుడి ఇసుకదందాపై పోరాడినందుకే నారాయణరెడ్డిని అంతం చేశారని అనడం కరెక్ట్కాదు. ఈ హత్యకూ మాకు ఎలాంటి సంబంధం లేదు. నారాయణరెడ్డి గన్ లైసెన్స్ ఎందుకు రెన్యూవల్ చేయలేదో పోలీసులనే అడగాలి..’ అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని, నారాయణరెడ్డిని చంపింది ఎవరో పోలీసుల విచారణలో తేలుతుందని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని కేఈ అన్నారు. ఇకపై కర్నూలు జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చూస్తానని చెప్పారు. హైకోర్టు మా పేర్లు చెప్పిందా? కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు నేతృత్వంలో సాగుతోన్న ఇసుక మాఫియాపై నారాయణరెడ్డి కోర్టును ఆశ్రయించడం, దందాలపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించడం తదితర అంశాల నేపథ్యంలో కేఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘హైకోర్టు ఆదేశాల్లో నా పేరుగానీ, నా కొడుకు పేరుగానీ ఉందా? నా వారసుడు కాబట్టే అభాండాలు వేస్తున్నారు. ఇసుక దందాపై కలెక్టర్, ఉన్నతాధికారులతో బహిరంగ చర్చ పెట్టాం. కానీ అప్పుడు ఎవరూ ముందుకురాలేదు’అని కేఈ పేర్కొన్నారు. -
'నిరూపిస్తే ఆ భూమి నీకే రాసిస్తా'
- డిప్యూటీ సీఎం కేఈకి పీఏసీ చైర్మన్ బుగ్గన సవాల్ - హంద్రీనీవా భూసేకరణలో బీనామీ పేర్లతో కేఈ కుటుంబీకులు రూ.కోట్లు స్వాహా డోన్ టౌన్: తన కుటుంబీకుల పేరుతో తొమ్మిది వందల ఎకరాల భూములు ఉన్నట్లు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోపణలు చేయడంపై పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డోన్ ఆర్ఈ రవికుమార్ స్వగృహంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలను కేఈ నిరూపిస్తే 899 ఎకరాల భూమిని ఆయనకే రాయించి ఒక ఎకరం మాత్రమే కేఈకి గుర్తుగా ఉంచుకుంటానని ఎద్దేవా చేశారు. వాస్తవంగా చెర్లోపల్లిలో తన పేరుపై ఎకరా భూమి ఉండగా కేఈలాంటి వ్యక్తులు అబద్దాలు, అభూత కల్పనలతో ప్రచారం చేయడం తగదన్నారు. బినామీ పేర్లతో ప్రజాధనాన్ని బొక్కేయడంలో కేఈ కుటుంబీకులుకు మించిన వారు జిల్లాలో లేరన్నారు. ఓర్వకల్లు సెజ్ ప్రాంతంలో, కంబాలపాడు హంద్రీనీవా భూసేకరణలో ప్రభుత్వ భూములకు బీనామీ పేర్లతో పట్టాలు సృష్టించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దిగమింగారని ఆరోపించారు. కేఈ కుటుంబీకులు అభివృద్ధి పనులకు ఏనాడు సెంటు స్థలం ఇవ్వలేదన్నారు. వంద ఏళ్ల చరిత్ర ఉన్న తన సొంత భూమికి భూసేకరణ చట్టప్రకారం నష్ట పరిహారం కోరానే తప్ప, అభివృద్ధి పనులను ఏనాడు అడ్డుకోలేదన్నారు. చెర్లోపల్లిలోని ఎకరా భూమికి తానే యజమానినని, భూమిపై తనకు సర్వహక్కులు ఉన్నాయని బుగ్గన ప్రకటించారు. కేఈ ఇంటిలో రోడ్డు వెడల్పంటూ అడుగు స్థలం దౌర్జన్యంగా ఆక్రమిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. తనకు నోటీసు ఇవ్వకుండా అధికారమదంతో పోలీసులను అడ్డుపెట్టుకొని స్థలాన్ని ఆక్రమిస్తే కోర్టుకు వెళ్లడం తప్ప తనకు మరో మార్గం కనపడలేదన్నారు. అడిగితే ఉచితంగా ఇచ్చేవాడిని: అభివృద్ధి పనులకు తాను వ్యతిరేకమని కేఈ ప్రచారం చేయడంపై బుగ్గన మండిపడ్డారు. నష్టపరిహారం చెల్లించి చట్టప్రకారం భూమిని తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను తానే స్వయంగా కోరిన విషయాన్ని బుగ్గన గుర్తుచేశారు. సామరస్యంగా తనను అడిగినట్లయితే ఎకరం భూమిని ఉచితంగా ఇచ్చేవాడినని తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పుల్లారెడ్డి, వెంకోబరావ్, రాజవర్దన్, దినేష్‌గౌడ్, మల్లెంపల్లి రామచంద్రుడు,పెద్దిరెడ్డి, కోట్రికే హరికిషన్, రాజశేఖర్‌రెడ్డి, గజేంద్ర, కటిక వేణు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక ప్రాంతంగా సుంకేసుల
► కేసీ కాలువకు నీరు విడుదల చేసిన డిప్యూటీ సీఎం ► సుంకేసుల జలాశయం జలకళ సంతరించుకుంది. నంద్యాల ప్రాంత తాగునీటి అవసరాలు తీర్చేందుకు గురువారం కేసీ ► కెనాల్ రెండు గేట్ల ద్వారా 500 క్యూసెక్కుల నీరు విడుదలయింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు జిల్లా ►కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ బ్యారేజీ వద్ద పూజలు నిర్వహించి నీటిని దిగువకు విడుదల చేశారు. కర్నూలు సిటీ/గూడూరు రూరల్: సుంకేసుల బ్యారేజీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం కె.ఈ.కృష్ణమూర్తి అన్నారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌తో కలిసి సుంకేసుల బ్యారేజీ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కర్నూలు-కడప కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజన్ మొదట్లోనే బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరడం సంతోషకరమన్నారు. బ్యారేజీ పూర్తి స్థాయి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా, ఇప్పటికే సుమారు ఒక టీఎంసీ నీరు వచ్చిందన్నారు. ఇన్‌ఫ్లో దృష్ట్యా నంద్యాల ప్రాంత తాగునీటి అవసరాలకు కేసీ కెనాల్ ద్వారా నీరు విడుదల చేశామన్నారు. అనంతరం సుంకేసుల బ్యారేజీ కరకట్ట స్థితిగతులపై చీఫ్ ఇంజనీర్ చిట్టిబాబు, పర్యవేక్షక ఇంజనీర్ చంద్రశేఖర్ రావులు డిప్యూటీ సీఎంకు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, గొర్రెల సహకార సంఘం చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, డీఈఈ జవహర్ రెడ్డి, ఏఈఈ అశ్విని కూమారి, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, కోడుమూరు సీఐ డేగల ప్రభాకర్, గూడురు ఎస్ఐ చంద్రబాబు పాల్గొన్నారు. -
పార్టీని విమర్శిస్తే చర్యలు తప్పవు
కేఈ ప్రభాకర్‌కు డిప్యూటీ సీఎం కేఈ హెచ్చరిక కర్నూలు: సీఎం చంద్రబాబును, టీడీపీని విమర్శిస్తే అన్న, తమ్ముడు, బంధువు, స్నేహితులు అనే సంబంధం లేకుండా ప్రతివిమర్శ చేయాల్సి వస్తుందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి.. తనసోదరుడు కేఈ ప్రభాకర్‌ను పరోక్షంగా హెచ్చరించారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని, అందుకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు ఉంటాయని తెలిపారు. శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన సందర్భంగా కేఈ ప్రభాకర్‌కు సీఎం చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చారో తనకు తెలియదన్నారు. -
తనిఖీలతో హడలెత్తించిన డిప్యూటీ సీఎం
కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డుల పరిశీలన విధులకు ఆలస్యంగా హాజరవుతున్న ఉద్యోగులపై మండిపాటు దళారులను దూరంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు సాక్షి, కర్నూలు : రాష్ట్ర ఉప ముఖ్యంత్రి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖామాత్యులు కేఈ కృష్ణమూర్తి చేపట్టిన ఆకస్మిక తనిఖీ ఆ శాఖ ఉద్యోగుల్లో దడ పుట్టించింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా తన సొంత శాఖకు చెందిన కార్యాలయాల్లో శుక్రవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్టి, సొంత శాఖ ప్రక్షాళనకు ఆయన నడుబింగించారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ సముదాయానికి ఆయన ఉదయం 10.30 గంటలకే చేరుకుని ఆకస్మిక తనిఖీ చేపట్టారు. తొలుత కల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్న ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. సమయపాలన పాటించకుండా ఆలస్యంగా కార్యాలయాలకు వస్తున్న వారిపై మండిపడ్డారు. ఎవరెవరు రాలేదని ఆరా తీశారు. వారందరికీ హాజరు పట్టికలో గైర్హాజరు వేయించారు. ఇలాంటివి మరోసారి పునరావృతం కారాదని వారిని తీవ్రంగా హెచ్చరించారు. అలాగే సెంట్రల్ సర్వర్ పనిచేస్తుందా లేదా అని అదే కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో ఎన్ని రిజిస్ట్రేషన్లు స్కానింగ్ చేశారనే వివరాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. 14వ తేదీ గురువారం ఒక్కరోజు 32 డాక్యుమెంట్లు, రూ 6.50 లక్షల ఆదాయం వచ్చిందని సబ్‌రిజిస్ట్రార్ వెంకటరమణారావు వివరించారు. అక్కడి నుంచి నేరుగా రికార్డు గదిలోకి వెళ్లి రికార్డులను పరిశీలించారు. అదే సమయంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటరావు విధులకు హాజరుకావడంతో విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ తనిఖీలు.. కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ డిప్యూటీ సీఎం తనీఖీ చేశారు. జూనియర్ అసిస్టెంట్, కర్నూలు జాయింట్-2 సబ్‌రిజిస్ట్రార్ కూడా సమయానికి విధులకు హాజరుకాకపోవడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా రిజిస్ట్రార్ శివగోపాల్ ప్రసాద్ కూడా సమయానికి విధుల్లో లేకపోవడంతో ఆయన ఎక్కడా అని డిప్యూటీ సీఎం ఆరా తీశారు. అతను హైదరాబాద్‌కు డ్యూటీ నిమిత్తం వెళ్లారని సిబ్బంది తెలుపుగా.. పేర్కొనగా.. అసలు ఆయన ఆన్‌డ్యూటీపై వెళ్లారా... సెలవు పెట్టారా... అన్న సమాచారం రిజిస్టర్లో పేర్కొనకపోతే ఎలా అని కేఈ కోపోద్రిక్తుడయ్యారు. కర్నూలు కార్యాలయంలో వస్తున్న ఆదాయం గురించి జాయింట్-1 మహబూబ్‌బాషను అడిగారు. గత నెల ఏప్రిల్‌లో టార్గెట్ 2.44 కోట్లు ఉండగా ఆదాయం రూ 5.84 కోట్లు వచ్చిందని వివరించారు. ఈ ఆదాయం కూడా కేవలం బిర్లా కాంపౌండ్ స్థలాల్లో నిర్మితమవుతున్న బిల్డింగులు, అపార్ట్మెంట్ల అమమ్మకాలు కొనుగోలు జరుగుతుండటంతో వస్తుందని డిప్యూటీ సీఎంకు జాయింట్-1 వివరించారు. ఇదే సమయంలో దళారులపై ప్రమేయంపై కేఈ ఆరా తీశారు. వారి ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్లను చేపట్టాలని, వారిని దూరంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఓ కంటింజెంట్ ఉద్యోగి తనకు రెండు నెలలుగా వేతనం రాలేదని చెప్పగా వెంటనే సంబంధిత ఫైలును పంపిస్తే నిధులు మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు పయనమై వెళ్లారు. డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీ చేపట్టడంతో భద్రతా సిబ్బంది ఎవ్వరిని కార్యాలయాల్లోకి అనుమతించలేదు. అయితే పోలీసులు అడ్డుకున్న వారంతా కార్యాలయ సిబ్బంది కావడం కొసమెరుపు. -
వైఎస్ జగన్‌ను ప్రశంసించిన డిప్యూటీ సీఎం కేఈ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు రెండేళ్లు పడుతుందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని రాజధాని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రాజధాని ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన వారి తరపున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడి మైలేజ్ పొందారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అసెంబ్లీలో వ్యవహరించిన తీరును కేఈ కృష్ణమూర్తి ప్రశంసించారు. కొన్ని చర్చల్లో వైఎస్ఆర్ సీపీకి మేలు జరిగే అంశాలున్నాయని కేఈ అన్నారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే బాధ్యత చంద్రబాబుపైనే ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రాయలసీమ మద్దతు ఉంటుందని, తమకు ప్రధానంగా కావల్సింది సాగునీరు అని అన్నారు.