
ఆ హత్యతో నాకు సంబంధం లేదు: కేఈ
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణరెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. తనకుగానీ, ముఖ్యమంత్రికిగానీ హత్యలు చేయించాల్సిన అవసరం లేదన్నారు. తాను హత్యా రాజకీయాలు ప్రోత్సహించనని తెలిపారు. ఆయన సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నారాయణరెడ్డి హత్యలో తన పాత్ర ఉందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించడం తగదన్నారు. తాను ఆ నియోజకవర్గం నుంచి గెలిచి ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను కాబట్టే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
ఆయన్ను ఎవరు హత్య చేశారో పోలీసు విచారణలో తేలుతుందన్నారు. తాను పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. ఈ హత్యలో తనతోపాటు తన కుమారుడు శ్యాంబాబుకూ సంబంధం లేదన్నారు. తానెప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని, తనపై కావాలనే ప్రతిపక్ష నేత బురద జల్లుతున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించి తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. తన రాజకీయ వారసుడు శ్యాంబాబని గతంలోనే చెప్పానని, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయన్ను పత్తికొండ నియోజకవర్గం టీడీపీ కో–ఆర్డినేటర్‌గా నియమించారని తెలిపారు.